వృద్ది రేటు పడిపోవడానికి కారణం ఆయనే 

Growth Rate Declined Due To Raghuram Rajan Policies: Niti Aayog - Sakshi

న్యూఢిల్లీ : ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అందరికి సుపరిచితమే. ఆయన పనితీరుపై ఓ వైపు నుంచి ఆరోపణలు, విమర్శలు వచ్చినా.. మరోవైపు భేష్‌ అన్నవారు ఉన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా రెండో సారి రాజన్‌ను కొనసాగించాలని మద్దతు కూడా తెలిపారు. కానీ రాజన్‌ ముక్కుసూటితనం, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు రెండో సారి ఆయనకు ఆర్‌బీఐ గవర్నర్‌ పదవి వరించకుండా పోయింది. తాజాగా రఘురామ్‌ రాజన్‌ మరోసారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృద్ధి రేటు పడిపోవడానికి కారణం రాజన్‌ అప్పట్లో తీసుకొచ్చిన విధానాలేనని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ఆరోపించారు. బ్యాంకింగ్‌ రంగంలోని ఎన్‌పీఏలు పెరగడంతో, వృద్ధి రేటు పడిపోయిందని కుమార్‌ అన్నారు. 2015 చివరి క్వార్టర్‌ నుంచి 2016 వరకు వృద్ధి రేటు క్షీణించిందని చెప్పారు. దీనికి గల కారణం రఘురామ్‌ రాజన్‌ అనుసరించిన విధానాలేనని, పెద్ద నోట్ల రద్దు కాదని వ్యాఖ్యానించారు.

ఎన్‌పీఏలను గుర్తించడానికి ఆర్‌బీఐ కొత్త మెకానిజం తీసుకొచ్చిందని, ఆ మెకానిజంతో మొండిబకాయిలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎన్‌పీఏలు 4 లక్షల కోట్ల రూపాయలుంటే, 2017 మధ్యకు ఇవి రూ.10.5 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపారు. ఇక అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయన్నారు. కొన్ని కేసుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పరిశ్రమ క్రెడిట్‌ కూడా కిందకి పడిపోయిందన్నారు. కొన్నేళ్లలో నెగిటివ్‌ వృద్ధి కూడా నమోదైందని తెలిపారు. అయితే వృద్ది రేటు నెమ్మదించడానికి, పెద్ద నోట్ల రద్దుకు ఎలాంటి సంబంధం లేదని కుమార్‌ తేల్చేశారు. ఇక స్థూల తరహా పరిశ్రమ తీసుకున్నా.. వృద్ధి రేటు ఒక శాతం మేర పడిపోయిందని, కొన్ని నెలలు రెండున్నర శాతం తగ్గిందని, మరికొన్ని త్రైమాసికాలు నెగిటివ్‌ కూడా నమోదైందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన రిపోర్టుపై స్పందిస్తూ... డిమానిటైజేషన్‌ను బ్లాక్‌మనీ, బినామీ లావాదేవీలను నిర్మూలించడానికి తీసుకొచ్చామని పునరుద్ఘాటించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top