రేట్ల తగ్గింపు ప్రతికూలమే

Govt's decision to reduce fuel prices credit negative for OMCs: Moody's - Sakshi

చమురు కంపెనీలపై మూడీస్‌ అంచనా

రూ.6.500 కోట్ల మేర తగ్గనున్న 3 సంస్థల మార్జిన్లు

హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్‌ రేట్లను రూ. 2.50 మేర తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చమురు మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎంసీ) మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ సోమవారం తెలిపింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగంలోని మూడు సంస్థల (ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌) మొత్తం ఎబిటా మార్జిన్లు రూ.6,500 కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని వివరించింది.

ఇది గత ఆర్థిక సంవత్సరంలో వాటి ఎబిటాలో దాదాపు 9 శాతం. 2018 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఎబిటా రూ. 69,200 కోట్లు. అయితే, ప్రతికూల ప్రభావాలు ఎలా ఉన్నా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు అధిక ఎబిటానే నమోదు చేసే అవకాశం ఉందని నివేదికలో మూడీస్‌ పేర్కొంది. అమ్మకాల పరిమాణం పెరగడం, రిఫైనింగ్‌ మార్జిన్లు స్థిరంగా ఉండటం, రూపాయి మారకం విలువ క్షీణత ఇందుకు దోహదపడగలవని వివరించింది.  

అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు భారీగా పెరగడం, దేశీ కరెన్సీ విలువ పడిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్‌ రేట్లు సైతం గణనీయంగానే పెరిగాయి. అయితే, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో పెట్రోల్, డీజిల్‌ రేట్లను రూ. 2.50 మేర తగ్గిస్తున్నట్లు అక్టోబర్‌ 4న కేంద్రం ప్రకటించింది.

లీటరుకు ఎక్సైజ్‌ సుంకాన్ని రూ. 1.50 తగ్గించిన కేంద్రం.. మరో రూ. 1 మేర రేటు తగ్గింపు భారాన్ని భరించాల్సిందిగా చమురు మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించింది. దేశీయంగా రిటైల్‌ ఇంధన అమ్మకాల్లో 95 శాతం మార్కెట్‌ వాటా ఉన్న ఓఎంసీల రుణపరపతికి ఈ నిర్ణయం ప్రతికూలమని మూడీస్‌ పేర్కొంది. పెరిగిన ముడిచమురు రేట్ల భారాన్ని కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో బదలాయించకపోవడం వల్ల వాటి ఆదాయాలు దెబ్బతింటాయని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top