ఎయిరిండియా ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

Good News For Air India Employees - Sakshi

న్యూఢిల్లీ : అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, తన ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీ సీలింగ్‌ మొత్తాన్ని రెండింతలు చేసింది. దీంతో ఈ మొత్తం 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెరిగింది. జూన్‌ 26న ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘2018 మే 21న జరిగిన ఎయిరిండియా లిమిటెడ్‌ బోర్డు మీటింగ్‌లో ఉద్యోగులకు అందించే ప్రస్తుతమున్న సీలింగ్‌ పరిమితిని గ్రాట్యుటీ చెల్లింపుల సవరణ చట్టం 2018 కింద 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయించాం. 2018 మార్చి 29 నుంచి ఇది అమల్లోకి వస్తుంది అని పేర్కొంది. ఈ ప్రకటన సుమారు 6500 మంది ఎయిరిండియా ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. 

అంతకముందు ఒకవేళ ఎవరికైనా గ్రాట్యుటీ 10 లక్షల కంటే ఎక్కువగా అందాల్సి ఉంటే, కేవలం 10 లక్షల రూపాయలను మాత్రమే అందించేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు గ్రాట్యుటీ మొత్తాన్ని పొందవచ్చు. ఎయిరిండియా డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం మరో మూడు లేదా నాలుగు నెలల పాటు ‘వెయిట్‌ అండ్‌ వాచ్‌’ పాలసీని చేపట్టాలని నిర్ణయించినట్టు ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. మే 31తో ముగిసిన బిడ్డింగ్‌లో ఏ బిడ్డర్‌ను కూడా ఎయిరిండియా ఆకట్టుకోలేకపోయింది. అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను ఏ ఒక్క బిడ్డర్‌  కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.  ఇంధన ధరలు పెరుగుతుండటంతో, ప్రస్తుతం డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ క్లిష్టతరమవుతుందని ఎయిరిండియా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎయిరిండియాలో 76 శాతం వాటాను విక్రయించాలనుకుంటోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top