
న్యూఢిల్లీ: ఆగ్రి–బిజినెస్ కంపెనీ గోద్రేజ్ ఆగ్రోవెట్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించాయి. ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.460తో పోలిస్తే 35 శాతం లాభంతో రూ.621 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రాడేలో 37 శాతం లాభంతో రూ.630 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 29 శాతం లాభంతో రూ.596 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కూడా ఇదే ధర వద్ద ముగిసింది.
సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,436 కోట్లుగా ఉంది. ఇక బీఎస్‌ఈలో 36.77 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 2 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ నెల 4–6 తేదీల్లో వచ్చిన ఈ కంపెనీ ఐపీఓ 95 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,157 కోట్లు సమీకరించింది.
ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్(ఇండియా) కంపెనీలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించాయి. ఈ ఆగ్రి–బిజినెస్ కంపెనీ ఐదు విభాగాల్లో–జంతువుల దాణా, సస్య రక్షణ, ఆయిల్ పామ్, డైరీ, పౌల్ట్రీ, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.