హైదరాబాద్‌లో మల్టిసోర్బ్‌ ప్లాంట్‌

GMR hands over facilities to US company - Sakshi

అమెరికా వెలుపల ఇదే తొలి కేంద్రం

జీఎంఆర్‌ సెజ్‌లో రూ.44 కోట్లతో ఏర్పాటు

త్వరలోనే ఆక్సిజన్, తేమ ప్యాకేజ్‌ల తయారీ

మల్టిసోర్బ్‌ సీఈఓ ఎరిక్‌ అర్మీనట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన మరో కంపెనీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కెమికల్, ఫార్మా రంగాల్లో అవసరమైన ఆక్సిజన్, తేమ ప్యాకేజింగ్‌ ఉత్పత్తులను తయారు చేసే మల్టిసోర్బ్‌.. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏవియేషన్‌ సెజ్‌ (జీహెచ్‌ఏఎస్‌ఎల్‌)లో దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ప్లాంట్‌ నిర్మాణం, తయారీ యంత్రాలు ఇతరత్రా వాటి కోసం తొలి దశలో రూ.44 కోట్ల పెట్టుబడులు పెట్టామని.. ప్రస్తుతం ఈ కేంద్రంలో 35 మంది ఉద్యోగులు పనిచేస్తారని మల్టిసోర్బ్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈఓ ఎరిక్‌ అర్మీనట్‌ తెలిపారు. గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఫిల్ట్రేషన్‌ గ్రూప్‌ జీఎం లక్ష్మికాంత్‌ కైటాన్, సీఓఓ మిచెల్‌ లిప్పాలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికాలో రెండు తయారీ కేంద్రాలున్నాయని.. యూఎస్‌ తర్వాత తొలి తయారీ కేంద్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్లాంట్‌లో రసాయన, ఫార్మా, మెడికల్‌ డివైజ్‌ రంగాలకు అవసరమైన మినిపాక్స్, స్ట్రిప్‌పాక్స్, ఇంటెలిసోర్బ్, స్టాబిలాక్స్‌ యాక్టివ్‌ ప్యాకేజ్‌ ఉత్పత్తులను తయారు చేస్తామని చెప్పారు. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30 కోట్ల ప్యాకేజ్‌లుంటుందని.. ఏడాదిలో 100 కోట్ల ప్యాకేజ్‌లకు పెంచుతామని ఆయన చెప్పారు. 

త్వరలోనే ఆర్‌అండ్‌డీ కూడా ఇక్కడికే..
ప్రస్తుతం దేశీయ కంపెనీలకు అవసరమైన ఉత్పత్తులను అమెరికాలో తయారు చేసి విమానాలు, సముద్ర మార్గాల ద్వారా ఎగుమతి చేస్తున్నాం. కానీ, ఇక నుంచి ఆయా ఉత్పత్తులను హైదరాబాద్‌ కేంద్రంలోనే తయారు చేస్తాం. త్వరలోనే పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (ఆర్‌అండ్‌డీ) కూడా ఇక్కడికే తరలిస్తామని ఎరిక్‌ తెలిపారు. 2 ఎకరాల్లోని ఈ తయారీ కేంద్రాన్ని జీఎంఆర్‌ ఏవియేషన్‌ సెజ్‌ నిర్మించిందని.. 38 ఏళ్ల పాటు లీజింగ్‌ ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. హెల్త్‌కేర్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలకు ప్యాకేజ్డ్‌ ఆక్సిజన్, తేమ ఉత్పత్తులను అందించే ఫిల్ట్రేషన్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థే ఈ మల్టిసోర్బ్‌ కంపెనీ. గత ఆర్ధిక సంవత్సరంలో ఫిల్ట్రేషన్‌ గ్రూప్‌ టర్నోవర్‌ 125 మిలియన్‌ డాలర్లు. ఇందులో 10 శాతం ఇండియా వాటా ఉంటుందని.. డాక్టర్‌ రెడ్డిస్, అరబిందో, సన్‌ఫార్మా వంటి దేశంలోని ప్రముఖ 60 కంపెనీలు మా క్లయింట్‌గా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఏఎస్‌ఎల్‌ హెడ్‌ సౌరభ్‌ జైన్‌ కూడా పాల్గొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top