‘ముక్క’ ముట్టడం లేదు! | Global poultry traded affected by Coronavirus | Sakshi
Sakshi News home page

‘ముక్క’ ముట్టడం లేదు!

Feb 28 2020 4:35 AM | Updated on Feb 28 2020 12:04 PM

Global poultry traded affected by Coronavirus - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా చికెన్‌ అమ్మకాలు నెల రోజుల్లో 50 శాతానికి పడిపోయాయి. ఫాం గేట్‌ ధర 70 శాతం తగ్గింది. చికెన్‌ తింటే కరోనా వైరస్‌ వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని గోద్రెజ్‌ అగ్రోవెట్‌ ఎండీ బి.ఎస్‌.యాదవ్‌ తెలిపారు. వారానికి 6 లక్షల కోళ్లు విక్రయించేవారమని, నెల రోజుల్లో 40 శాతం అమ్మకాలు తగ్గాయని చెప్పారు. వదంతులు ఆగిపోయి తిరిగి అమ్మకాలు రెండు మూడు నెలల్లో పుంజుకున్నాక చికెన్‌ కొరత ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే ధరలు పెరుగుతాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రతి వారం 7.5 కోట్ల కోళ్లు అమ్ముడవుతున్నాయని, ఇది 3.5 కోట్ల కోళ్లకు వచ్చిందని గుర్తుచేశారు. కాగా, హైదరాబాద్‌ మార్కెట్లో కొద్ది రోజుల క్రితం స్కిన్‌లెస్‌ చికెన్‌ మాంసం రూ.250 దాకా దూసుకెళ్లింది. గత వారం రూ.110కి దిగొచ్చి ప్రస్తుతం రూ.130 పలుకుతోంది.

ఇక్కడ సాధారణ స్థితికి..
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. రెండు వారాల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు సాధారణ స్థితికి వచ్చాయని స్నేహ ఫామ్స్‌ సీఎండీ డి.రామ్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 30 శాతం అమ్మకాలు పడిపోయాయి. చికెన్‌ ఫాం గేట్‌ ధర రూ.80 నుంచి రూ.35 వరకు వెళ్లింది. ఇప్పుడు రూ.42కు వచ్చింది. వారానికి సరిపడ నిల్వలు పౌల్ట్రీల వద్ద మిగిలిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాంసాహారం ఎక్కువ తింటారు కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వదంతుల ప్రభావం తక్కువగా ఉంది. సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వినియోగం సాధారణ స్థితికి వచ్చింది. ధరలు రోజురోజు కూ పెరుగుతున్నాయి. చికెన్‌కు కరోనాకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి’ అని వివరించారు.

నష్టం రూ.7,000 కోట్ల పైనే..!
కరోనా వదంతుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ పరిశ్రమ రూ.700 కోట్ల వరకు నష్టపోయిందని రామ్‌ రెడ్డి వెల్లడించారు. కోడి ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.80 అవుతోందని, విక్రయ ధర సగానికి పడిపోవడంతో పౌల్ట్రీ సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయని చెప్పారు. ఈ నష్టం దేశవ్యాప్తంగా ఎంత కాదన్నా రూ. 7,000 కోట్ల పైచిలుకు ఉంటుందని ఆ యన అంచనా వేశారు. తమకు సం బంధం లేకపోయినా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బ్యాచ్‌ వేయడానికి రైతుల వద్ద మూలధనం లేదన్నారు. వాస్తవానికి సాధారణ రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 15–20 లక్షల కోళ్లు అమ్ముడయ్యేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement