ముడిచమురు @ 75 డాలర్లు

Global oil prices soar, India remains stable - Sakshi

ఆరునెలల గరిష్టస్థాయి నమోదు

లండన్‌: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు మంటలు మొదలయ్యాయి. గురువారం ట్రేడింగ్‌లో బ్రెంట్‌క్రూడ్‌ ధర 75 డాలర్ల పైన ఆరునెలల గరిష్ఠస్థాయిని తాకింది. ఇరాన్‌పై ఆంక్షలతో చమురు సరఫరా అతలాకుతలం అవుతుందన్న ఆందోళనలు చమురు ధరల్లో కాక పెంచాయి. గురువారం ఇంట్రాడేలో బ్రెంట్‌ క్రూడ్‌ 75.60 డాలర్లను తాకింది. గత అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయి చూడడం ఇదే తొలిసారి. మరోవైపు డబ్లు్యటీఐ క్రూడ్‌ సైతం ఆరునెలల గరిష్టం 66.16 డాలర్లను చేరింది. ఇరాన్‌పై గతంలోనే ఆంక్షలు విధించిన అమెరికా అప్పట్లో ఎనిమిది దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజాగా ఈ మినహాయింపును కొనసాగించేది లేదని యూఎస్‌ స్పష్టం చేసింది.

మే2తో మినహాయింపుల గడువు ముగియనుంది. ఇరాన్‌ సరఫరా కొరతను దృష్టిలో ఉంచుకొని ఒపెక్‌ తన ఉత్పత్తి కోతలను తగ్గించుకుంటుందా, లేక కొనసాగిస్తుందా? అని నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు చమురు ఉత్పత్తి పెంచే ఆలోచనేమీ లేదని ఒపెక్‌ పెద్దన్న సౌదీ బుధవారం ప్రకటించింది. ఆంక్షల ప్రభావం ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా చమురు ఇన్వెంటరీల్లో మంచి పెరుగుదలే నమోదవుతోందని, అందువల్ల ఇప్పుడే ఉత్పత్తి కోతను తగ్గించాలని అనుకోవడం లేదని సౌదీ ఎనర్జీ మంత్రి ఖలీద్‌ అల్‌ఫలీహ్‌ చెప్పారు. ఒపెక్, రష్యాలు తీసుకున్న ఉత్పత్తి కోత నిర్ణయాలే ఈ ఏడాది చమురు ధరల్లో రికవరీకి కారణం. ప్రస్తుతం ఇరాన్, వెనుజులా, లిబియాల్లో ఉత్పత్తి, సరఫరా సంక్షోభంలో పడినందున ఒపెక్‌ కోతలు ఇలాగే కొనసాగితే ముడిచమురు ధరలకు రెక్కలు వస్తాయని అంచనా.  

ఆంక్షలు అక్రమం
యూఎస్‌ తమపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్‌ అధిపతి ఆయతుల్లా ఖొమైనీ డిమాండ్‌ చేశారు. తమ చమురు సరఫరాపై ఆంక్షల విధింపు అక్రమమని, ఇందుకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్‌ ఎంత కావాలంటే అంత, ఎవరికి కావాలంటే వాళ్లకి చమురు సరఫరా చేయగలదన్నారు. 2015లో ఇరాన్‌తో ప్రపంచ అగ్రదేశాలు కుదుర్చుకున్న న్యూక్లియర్‌ డీల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఆంక్షలను విధించారు. అయితే ముందస్తు ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని ఎనిమిది దేశాలకు ఈ ఆంక్షల నుంచి కొంతకాలం మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే మినహాయింపులు పొందిన ఎనిమిది దేశాల్లో ఐదు దేశాలు(గ్రీస్, ఇటలీ, జపాన్, సౌత్‌కొరియా, తైవాన్‌) ఇరాన్‌ చమురు దిగుమతులను సాధ్యమైనంతవరకు తగ్గించుకున్నాయి. చైనా, ఇండియాలు మాత్రం మినహాయింపుల కొనసాగింపు కోసం చివరి వరకు యత్నించాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా రష్యా నుంచి పొలండ్, జర్మనీకి జరిగే చమురు సరఫరా సాంకేతిక కారణాలతో నిలిచిపోవడం కూడా ముడిచమురు డిమాండ్‌ పెరిగేందుకు కారణమైంది.  

ఈ పరుగు తాత్కాలికమేనా?
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బ్రెంట్‌ధర దాదాపు 40 శాతం ర్యాలీ జరిపింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగిస్తోందన్న ఆందోళనలు పెరిగిపోతున్న తరుణాన, బ్రెంట్‌ క్రూడ్‌ ధరల పెరుగుదల తాత్కాలికమేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మందగమన ప్రభావంతో మార్కెట్లో చమురు నిల్వలు పెరిగిపోతున్నాయని, సరఫరా ఎక్కడా దెబ్బతినలేదని యూఎస్‌    ప్రత్యేక ప్రతినిధి బ్రైన్‌హుక్‌ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబర్‌ నుంచి రష్యా, సౌదీ, ఇరాక్‌లు తగ్గించిన ఉత్పత్తి ఇరాన్‌ చమురు సరఫరాకు దాదాపు సమానమని ఎనర్జీ కన్సెల్టెన్సీ రైస్టాడ్‌ఎనర్జీ వెల్లడించింది. ఈ దేశాలు కోతలను ఆపేస్తే చమురు సరఫరా యథాత«థంగా ఉంటుందని, అందువల్ల ధరలు విపరీతంగా      పెరగకపోవచ్చని పేర్కొంది. యూఎస్‌ షేల్‌ గ్యాస్‌ ఉత్పత్తి బలంగా పెరుగుతున్నది, దీంతో ప్రపంచంలో సౌదీ, రష్యాలను తోసిరాజని అమెరికా చమురు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగిస్తోందని, అందువల్ల ఈ ఏడాది చమురు ధరల్లో డౌన్‌ట్రెండ్‌       ఉండొచ్చని క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ అంచనా వేసింది. ఇందుకు తగ్గట్లే సౌత్‌కొరియా ఎకానమీ తొలి త్రైమాసికంలో అనూహ్యంగా తరుగుదల నమోదు చేసింది. చైనా సైతం మందగమన       ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. మందగమన భయాలతో పలు దేశాల కేంద్రబ్యాంకులు     వడ్డీరేట్ల తగ్గింపు సహా పలు చర్యలను ప్రకటిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top