లోన్‌ కావాలా నాయనా!

Gaurav Gupta startup dairy special - Sakshi

24 బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీలతో  మైలోన్‌కేర్‌ ఒప్పందం 

గతేడాది వెయ్యి కోట్లు; ఈ ఏడాది రూ.2,500 కోట్ల పంపిణీ లక్ష్యం 

25 లక్షల మంది కస్టమర్లు;  తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతం 

రూ. 8 కోట్ల నిధుల సమీకరణ పూర్తి 

‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ అండ్‌ సీఈఓ గౌరవ్‌ గుప్తా 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణం విషయంలో సిబిల్‌ స్కోర్, బ్యాంక్‌ బ్యాలెన్స్, స్టేట్‌మెంట్‌ ప్రతి ఒక్కటీ కౌంట్‌ అవుతుంది. అందుకే వ్యాపారస్తులు, పెద్దలకు వచ్చినంత సులువుగా సామాన్యులకు, ఎస్‌ఎంఈలకు రుణాలు రావు. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది గుర్గావ్‌కు చెందిన మైలోన్‌కేర్‌.ఇన్‌. దేశంలోని ప్రముఖ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలతో ఒప్పందం చేసుకొని గృహ, బంగారు, వ్యాపార వంటి అన్ని రకాల రుణాలను అందిస్తుంది. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ గౌరవ్‌ గుప్తా ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. 

వడ్డీ రేట్లు 8.65 శాతం నుంచి.. 
‘‘ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, మణప్పురం, టాటా క్యాపిటల్‌ వంటి 24 బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వడ్డీ రేట్లు లోన్‌ను బట్టి 8.65 శాతం నుంచి 13.50 శాతం వరకున్నాయి. గృహ, వ్యక్తిగత, బంగారు, ప్రాపర్టీ, వ్యాపారం వంటి అన్ని రకాల రుణాలతో పాటూ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్స్‌ క్రెడిట్‌ కార్డులను కూడా అందిస్తాం. రూ.5 వేల నుంచి రూ.25 కోట్ల వరకు రుణాలుంటాయి. ప్రస్తుతం 25 లక్షల మంది కస్టమర్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 10 శాతం మంది ఉంటారు.  

ఈ ఏడాది రూ. 2,500 కోట్ల రుణాల లక్ష్యం.. 
కస్టమర్లు మైలోన్‌కేర్‌లో లాగిన్‌ అయి కావాల్సిన రుణ విభాగాన్ని ఎంచుకొని వ్యక్తిగత వివరాలు, రుణ అవసరాలను తెలిపితే.. ఆల్గరిథం ద్వారా కస్టమర్లకు 2–3 రకాల బ్యాంక్‌ రుణ అప్షన్లను ఇస్తుంది. వడ్డీ రేటు, కాలపరిమితిని బట్టి కస్టమర్‌ తనకు కావాల్సింది ఎంచుకోవచ్చు. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో రూ.1000 కోట్ల రుణాలను అందించాం. ఈ ఏడాది రూ.2,500 కోట్ల రుణాలను అందించాలని లక్షి్యంచాం. ప్రస్తుతం నెలకు లక్ష ఎంక్వైరీలు వస్తున్నాయి. రుణాన్ని బట్టి 0.5 నుంచి 3 శాతం వరకు కమీషన్, మార్కెటింగ్‌ ఫీజు ఉంటుంది. ప్రతి ఏటా 40 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తున్నాం. ఈ ఏడాది 150 శాతాన్ని లక్షి్యంచాం. మా మొత్తం ఆదాయంలో 17 శాతం తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నదే. 

ఎంఎఫ్, ట్యాక్స్‌ ప్లానింగ్‌లోకి.. 
ప్రస్తుతం మా కంపెనీలో 150 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేస్తాం. సేల్స్, టెక్నాలజీ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.8 కోట్ల నిధులను సమీకరించాం. ఎన్‌క్యుబేట్‌ క్యాపిటల్‌ వెంచర్, ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌ ఈ పెట్టుబడులు పెట్టాయి. ‘‘త్వరలోనే డిజిటల్‌ క్రెడిట్‌ కార్డ్‌లు, యాప్‌ ఆధారిత పర్సనల్‌ లోన్ల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాం. ఆ తర్వాత మ్యూచువల్‌ ఫండ్స్, ట్యాక్స్‌ ప్లానింగ్‌ విభాగాల్లోకి విస్తరిస్తామని’’ గౌరవ్‌ వివరించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top