అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే.. | Franklin India Feeder For Investments in US | Sakshi
Sakshi News home page

అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే..

Dec 30 2019 8:38 AM | Updated on Dec 30 2019 8:38 AM

Franklin India Feeder For Investments in US - Sakshi

పెట్టుబడులపై రిస్క్‌ తగ్గించుకునేందుకు పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం ఎంతో అవసరం. ఇన్వెస్టర్లు తప్పకుండా అనుసరించాల్సిన సూత్రం ఇది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఈక్విటీలో లేక రియల్‌ ఎస్టేట్‌లో.. ఇలా ఏ ఒక్క విభాగంలోనే ఇన్వెస్ట్‌ చేయడం వైవిధ్యానికి వ్యతిరేకం. ఇక ఈక్విటీల్లోనూ పెట్టుబడులన్నింటినీ ఒకే విభాగంలో ఇన్వెస్ట్‌ చేయడం కూడా వైవిధ్యం అనిపించుకోదు. కనుక వైవిధ్యం కోరుకునే వారు మన దేశ కంపెనీలతోపాటు, అమెరికాలో మంచి పనీతీరు చూపిస్తున్న స్టాక్స్‌లోనూ కొంత పెట్టుబడులు పెట్టడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవచ్చు. ఎందుకంటే గత రెండేళ్లలో మన మార్కెట్లు ఎన్నో అస్థిరతలు ఎదుర్కొంటే, అమెరికా మార్కెట్లు మంచి పనితీరు చూపించాయి. ఒకవేళ అక్కడ కూడా ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, గత రెండళ్ల కాలంలో మన మార్కెట్లలో ఉన్న అస్థిరతలను అధిగమించి మెరుగైన రాబడులు పొందే వారు. అమెరికన్‌ స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటిల్లో ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫీడర్‌ –  ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌ పథకం కూడా ఒకటి.  

వైవిధ్యం..
టెక్నాలజీ దిగ్గజాలు ఆల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృ సంస్థ), ఫేస్‌బుక్, యాపిల్‌తోపాటు రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ తదితర కంపెనీల పనితీరు ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఇంతటి విజయవంతమైన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటే.. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ద్వారా అదిప్పుడు సాధ్యమే. విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులతో వైవిధ్యమే కాదు మరో ప్రయోజనం కూడా ఉంది. భవిష్యత్తులో విదేశీ కరెన్సీ రూపంలో వ్యయాలు చేయాలనుకునే వారికి మంచి ఐడియానే అవుతుంది. అదెలా అంటే మీ పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకుంటే డాలర్లను ఖర్చు చేయాలి కదా. అలాగే, విదేశాల్లో మంచి చికిత్స తీసుకోవాలనుకున్నా సరే అది డాలర్‌ డినామినేషన్‌లోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. కనుక భవిష్యత్తులో విదేశీ కరెన్సీ రూపంలో ఎదురయ్యే ఖర్చులకు విదేశీ ఈక్విటీ పెట్టుబడుల రూపంలో ముందుగానే హెడ్జ్‌ చేసుకున్నట్టు అవుతుంది. భవిష్యత్తులో డాలర్‌తో రూపాయి మారకం మరింత క్షీణించినట్టయితే అప్పుడు ఈ పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందొచ్చు. 

పెట్టుబడుల విధానం–రాబడులు
ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫీడర్‌ – ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌ అన్నది ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. నిజానికి ఇది నేరుగా ఈక్విట్లీలో ఇన్వెస్ట్‌ చేసే పథకం కాదు. ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ అనే మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను కొనుగోలు చేసే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌. అందుకే పేరులో ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫీడర్‌ అని పేర్కొనడం జరిగింది. 2012లో ఈ పథకం ఆరంభమైంది. ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ అన్నది ప్రధానంగా అమెరికన్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫీడర్‌ ఫండ్‌ తన నిర్వహణలోని క్లయింట్ల పెట్టుబడుల్లో 95 శాతానికి తక్కువ కాకుండా ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే 99 శాతానికి పైగా పెట్టుబడులను ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ అపార్చునిటీస్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఈ పథకానికి మంచి రాబడుల చరిత్ర ఉంది. ఏడాది కాలంలో రాబడుల శాతం 3.2గా ఉంది. కానీ మూడేళ్లలో వార్షికంగా 17.8 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 13.6 శాతం చొప్పున రాబడులను అందించింది. ఉదాహరణకు మూడేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి నేటికి రూ.1.6 లక్షలు అయ్యేది. ప్రతీ నెలా రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసి ఉంటే మూడేళ్లలో రూ.4.7లక్షలు సమకూరేది. కనుక దీర్ఘకాలానికి, మరీ ముఖ్యంగా పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం కోసం ఈ పథకంలో సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement