
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 25 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.210 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.263 కోట్లకు పెరిగిందని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,653 కోట్ల నుంచి రూ.2,938 కోట్లకు వృద్ధి చెందిందని వివరించింది.
నికర వడ్డీ ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.980 కోట్లకు పెరిగిందని, రుణ వృద్ది 24 శాతం ఎగసిందని పేర్కొంది. అంతకు ముందటి క్వార్టర్‌లో 3.11 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ1లో 3.12 శాతానికి పెరిగింది.
తగ్గిన కేటాయింపులు...: మొండి బకాయిలు పెరగడంతో రుణ నాణ్యత క్షీణించింది. గత క్యూ1లో రూ.2,796 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.2,869 కోట్లకు పెరిగాయని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. అలాతే నికర మొండి బకాయిలు రూ.1,552 కోట్ల నుంచి రూ.1,620 కోట్లకు పెరిగాయని పేర్కొంది.
శాతం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 2.42 శాతం నుంచి 3.42 శాతానికి, నికర మొండి బకాయిలు 1.39 శాతం నుంచి 1.72 శాతానికి పెరిగాయని వివరించింది. అయినప్పటికీ మొండి బకాయిలకు, అత్యవసరాలకు కేటాయింపులు రూ.236 కోట్ల నుంచి రూ.199 కోట్లకు తగ్గాయని పేర్కొంది. కేటాయింపులు 16 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన) 46 శాతం తగ్గాయని తెలిపింది. అలాగే ఒత్తిడి రుణాలు రూ.2,890 కోట్ల నుంచి రూ.2,680 కోట్లకు తగ్గాయని పేర్కొంది.
మొండి బకాయిలు పెరిగినప్పటికీ, కేటాయింపులు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం, రుణ వృద్ధి పెరగడం, నికర లాభం 25 శాతం ఎగియడంతో ఫెడరల్ బ్యాంక్ షేర్ జోరుగా పెరిగింది. ఆరంభంలో ఏడాది కనిష్ట స్థాయి, రూ.73.60కు పడిపోయిన ఈ షేర్ బీఎస్‌ఈ ఇంట్రాడేలో 21 శాతం లాభంతో రూ.89కు ఎగసింది. చివరకు 19 శాతం లాభంతో రూ.88 వద్ద ముగిసింది. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.2,856 కోట్లు వృద్ధి చెంది రూ.17,469 కోట్లకు పెరిగింది.