క్రూడ్, విదేశీ పెట్టుబడులు కీలకం

Expectations on the market this week - Sakshi

ఈ వారం మార్కెట్‌పై అంచనాలు..

ఒడిదుడుకులు ఉండొచ్చు

నిఫ్టీ 10,500–10,900 మధ్య చలించే అవకాశం

నేడే ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలపై ఇన్వెస్టర్లలో ఆసక్తి

ముంబై: చమురు ధరలు, విదేశీ నిధుల ప్రవాహం ఈ వారం మార్కెట్‌ పయనాన్ని నిర్ణయించనున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం ఏ విధంగా ఉంటుంది? లిక్విడిటీ సమస్య నివారణకు ఆర్‌బీఐ సోమవారం (ఈ నెల 19న) నాటి భేటీలో తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రాల ఎన్నికల ప్రభావంతో ఒడిదుడుకులు ఉంటాయని భావిస్తున్నారు. ‘‘రూపాయి కదలిక, చమురు ధరలు, విదేశీ పెట్టుబడులను ఇన్వెస్టర్లు గమనించాల్సి ఉంటుంది.

నిఫ్టీ 10,500–10,900 మధ్య ట్రేడ్‌ కావొచ్చు. బ్యాంకు నిఫ్టీ 25,800– 26,600 పాయింట్ల మధ్య చలించొచ్చు’’ అని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అడ్వైజర్స్‌ చైర్మన్, ఎండీ డీకే అగర్వాల్‌ తెలిపారు. అధిక నిల్వలు, ప్రపంచ ఆర్థిక వృద్ధి నిదానించొచ్చన్న ఆందోళనలతో గత వారం చమురు బ్యారెల్‌ 67.74 డాలర్లకు పడిపోయింది. అక్టోబర్‌ ప్రారంభంలో 86 డాలర్లు ఉండగా, చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గడంతో ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటుపై ఆందోళనలు తగ్గి, మన స్టాక్‌ మార్కెట్లలో రికవరీకి దారితీసింది.

ప్రపంచంలో మన దేశం మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న విషయం తెలిసిందే. గత వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,502 కోట్ల మేర విలువైన షేర్లను కొన్నారు. అంతకుముందు వారంతో పోలిస్తే 22 రెట్లు అధికం. గత వారంలో రూపాయి 57 పైసలు లాభపడి 71.92కు చేరింది. ‘‘ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో తగ్గుతాయన్న విషయాన్ని మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు చేసుకున్నాయి.

అయితే, నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్లను బ్రేక్‌ చేసి పైకి వెళుతుందా? రూపాయి, చమురు ధరల్లో స్థిరత్వం అన్నవి మార్కెట్‌ దిశను నిర్దేశిస్తాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌నాయర్‌ పేర్కొన్నారు. ఈ వారం నిఫ్టీకి 10,755 పాయింట్లు నిరోధంగా, 10,440 పాయింట్లు మద్దతు స్థాయిగా పనిచేస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసాని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top