ఐసీసీ వరల్డ్‌ కప్‌ : ఆ వెబ్‌సైట్లకు, రేడియో ఛానెళ్లకు షాక్‌

Delhi High Court stops 60 websites, Radio Channels from Broadcasting ICC World Cup 2019 - Sakshi

ఛానల్‌ 2  గ్రూపు  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు 

60 వెబ్‌సైట్ల, రేడియో ఛానెళ్ల ఆడియో ప్రసారాల నిలిపివేత

సాక్షి, న్యూఢిల్లీ:  ఐసీసీ వరల్డ్‌కప్‌ 2019ల మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ  చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రపంచకప్‌ మ్యాచ్‌ల ఆడియో ప్రసారం చేస్తున్న సుమారు 60 వెబ్‌సైట్లు, రేడియో ఛానెళ్లకు షాక్‌ ఇచ్చింది. ఛానెల్‌-2 గ్రూప్‌ కార్పొరేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వీటి ఆడియో సేవలను ప్రసారం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ జేఆర్‌ మిథా నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. అంతేకాదు దీనిపై సమాధానం ఇవ్వాలంటూ సంబంధిత వెబ్‌సైట్లకు, రేడియో ఛానెళ్లకు, ఇంటర్నెట్‌, టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 4కు  వాయిదా వేసింది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌తో పాటు ఇంటర్నెట్‌, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు సంబంధిత వెబ్‌సైట్లకు సంబంధించిన లింకులను తొలగించాలని సూచించింది.

సన్నాహక మ్యాచ్‌లతో సహా మ్యాచ్‌లకు సంబంధించిన ఆడియోను ప్రసార హక్కులను పొందిన గ్రూప్‌ 2 ఛానల్‌ తమ ప్రత్యేకమైన, మేధో సంపత్తి హక్కులను కొన్ని వెబ్‌సైట్లు, రేడియో  ఛానళ్లు  దుర్వినియోగం చేశాయని ఆరోపించింది. తద్వారా తమకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతోందని వాదిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

యూఏఈ ఆధారిత సంస్థ ఛానల్ 2 గ్రూప్ ఐసీసీ  క్రికెట్‌ కౌన్సిల్‌ నుంచి 2023 వరకు ప్రత్యేక గ్లోబల్‌ ఆడియో హక్కులను కొనుగోలు చేసింది. ప్రత్యేకమైన ఆడియో హక్కులను కలిగి ఉన్నప్పటికీ, ఇంటర్నెట్, మొబైల్ బ్రాడ్‌కాస్టర్‌ హాట్‌స్టార్‌కి అధికారికపార్టనర్‌గా ఉంది. ఐసీసీ క్రికెట్‌ కౌన్సిల్‌కు చెందిన వాణిజ్య సంస్థ ఐసీసీ బిజినెస్ కార్పోరేషన్‌తో కొన్ని సంవత్సరాల క్రితం ఆడియో హక్కుల ఒప్పందంపై సంతకాలు చేసింది.  మే 30న మొదలైన ప్రపంచకప్‌ 2019  జులై 14 వరకు  జరగనున్నసంగతి తెలిసిందే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top