క్రిప్టోతో చట్టవిరుద్ధ లావాదేవీలు

Cryptocurrencies would encourage illegal transactions - Sakshi

సుప్రీంకోర్టుకు తెలిపిన ఆర్‌బీఐ

సెప్టెంబర్‌ 11న తుది విచారణ  

న్యూఢిల్లీ: బిట్‌కాయిన్‌ తరహా క్రిప్టో కరెన్సీల్లో క్రయ, విక్రయాలను అనుమతిస్తే చట్టవిరుద్ధ లావాదేవీలను ప్రోత్సహించినట్టు అవుతుందని సుప్రీంకోర్టుకు ఆర్‌బీఐ తెలిపింది. ఈ తరహా వర్చువల్‌ కరెన్సీల వినియోగాన్ని నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ‘‘క్రిప్టో కరెన్సీలు ప్రభుత్వ ఆమోదం లేనివి. ఎన్‌క్రిప్షన్‌ టెక్నిక్‌లను ఉపయోగించి వీటిని స్వతంత్రంగా నిర్వహిస్తుంటారు. క్రిప్టో కరెన్సీల వ్యవహారాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.

ఈ నేపథ్యంలో కోర్టు నుంచి త్వరగా నిర్ణయం రావాల్సి ఉంది’’ అని ఆర్‌బీఐ తరఫు న్యాయవాది శ్యామ్‌దివాన్‌... చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అధ్యక్షతన గల ధర్మాసనానికి నివేదించారు. ఈ విషయంలో దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఆర్‌బీఐ, కేంద్రం అభ్యర్థన మేరకు స్పందించేందుకు గడువు ఇస్తూ... తుది విచారణను సెప్టెంబర్‌ 11న చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వర్చువల్‌ కరెన్సీలపై పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను తమకు బదిలీ చేయాలని, ఇకపై ఈ విషయంలో ఏ పిటిషన్‌ను స్వీకరించొద్దని సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 17న అన్ని హైకోర్టులనూ ఆదేశించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top