మౌలికం ఉత్పత్తులు పూర్తిగా డౌన్‌

Core Industries Output Declines For Third Consecutive Month - Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడిపరమైన లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా మూడో నెలలో కూడా క్షీణత నమోదు చేసింది. మేలో 23.4 శాతం క్షీణించింది. 2019 మేలో ఎనిమిది రంగాల ఉత్పత్తి 3.8 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎరువుల పరిశ్రమ మినహా మిగతా ఏడు రంగాలన్నీ (బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్‌) మేలో ప్రతికూల వృద్ధే కనపర్చాయి. 2020–21 ఏప్రిల్‌–మే మధ్యకాలంలో మౌలిక రంగాల ఉత్పత్తి 30 శాతం క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 4.5 శాతం వృద్ధి సాధించింది. ‘ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో బొగ్గు, సిమెంటు, ఉక్కు, సహజ వాయువు, రిఫైనరీ, ముడిచమురు తదితర పరిశ్రమల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది‘ అని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  

క్షీణత తగ్గుముఖం పడుతోంది.. 
మే గణాంకాల బట్టి చూస్తే ఉత్పత్తి క్షీణత గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రిన్సిపల్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు. ‘ ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి 55.5 శాతం క్షీణించింది. ఈ ధోరణుల ప్రకారం చూస్తే మేలో ఇది 35–45 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది‘ అని పేర్కొన్నారు. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ ఎనిమిది రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది. వీటి ఉత్పత్తి ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 37 శాతం క్షీణించింది. తాజాగా మేలో బొగ్గు (14 శాతం క్షీణత), సహజ వాయువు (16.8 శాతం), రిఫైనరీ ఉత్పత్తులు (21.3 శాతం), ఉక్కు (48.4 శాతం), సిమెంటు (22.2 శాతం), విద్యుదుత్పత్తి (15.6 శాతం) క్షీణించాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top