ఇక... మన చేతికీ చైనా అప్పులు!

Chinas interest in indigenous Fintage companies - Sakshi

దేశీ ఫిన్‌టెక్‌ సంస్థలపై  చైనా కంపెనీల ఆసక్తి

లైన్‌లో బిలియన్‌ ఫైనాన్స్, ఐటూజీ, క్యాష్‌బస్‌

స్థానిక స్టార్టప్స్‌తో ఇప్పటికే చర్చలు  

ఇప్పటిదాకా వస్తువులతో ముంచెత్తిన చైనా కంపెనీలు... ఇకపై భారతీయులకు విరివిగా రుణాలివ్వటానికీ వస్తున్నాయి. కానీ చైనా వస్తువులు చౌకగా దొరికినట్లు... ఈ రుణాలు కూడా తక్కువ వడ్డీకే దొరుకుతాయనుకోలేం. ఎందుకంటే చైనాలో భారీ వడ్డీలకు రుణాలిస్తున్న ఈ సంస్థలు అక్కడ నియంత్రణలు, పరిమితులు పెరిగిపోవటంతో ఇటు చూస్తున్నాయి. అంటే ఈ రుణాలు కొంచెం ఖరీదైనవే అయి ఉండొచ్చు. స్వదేశంలో రుణ కార్యకలాపాలపై పరిమితులు పెరిగిపోతున్న నేపథ్యంలో చైనా ఆర్థిక సంస్థలు భారత మార్కెట్‌ వైపు చూస్తున్నాయి. ఇక్కడి ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడం, భాగస్వామ్యాలు కుదుర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే చైనాకి చెందిన కొన్ని ఆర్థిక సంస్థలు పలు స్టార్టప్‌ సంస్థల వ్యవస్థాపకులతో చర్చలు ఆరంభించాయి కూడా. ఆన్‌లైన్‌లో రుణాలు అందజేసే బిలియన్‌ ఫైనాన్స్, ఐటూజీ, ఫిన్‌టెక్‌ సంస్థలు ఫినప్, ఫెన్‌క్విల్, క్యాష్‌బస్‌ తదితర చైనా సంస్థలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.  రుణగ్రహీతల చెల్లింపు సామర్ధ్యాలను మదింపు చేసే ఫిన్‌టెక్‌ సంస్థ వుయ్‌ క్యాష్‌ ప్రతినిధులు కొన్నాళ్లుగా భారత్‌లోనే మకాం వేసి.. స్టార్టప్స్‌లో పెట్టుబడుల అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం త్వరలోనే భారత్‌లో ప్రత్యేకంగా టీమ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. అటు చైనా టెక్నాలజీ సంస్థ ఏపీయూఎస్, ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ సుషియాంగ్‌ మొదలైనవి కూడా ఇతరత్రా స్టార్టప్స్‌తో చర్చలు జరుపుతున్నాయి. 

మార్కెట్‌పై అవగాహనకు ప్రయత్నాలు..: ప్రస్తుతం భారత మార్కెట్లో పరిస్థితులు, పరిమితులు మొదలైనవి తెలుసుకునేందుకు చైనా సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆ తర్వాతే పెట్టుబడుల ప్రణాళికలకు తుదిరూపునివ్వనున్నాయి. ఇప్పటికే ఒకటి, రెండు సంస్థలు పెట్టుబడులూ పెట్టాయి. సూక్ష్మరుణాల సంస్థ ఫెన్‌క్విల్, స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ సంస్థ షావోమి ఇందులో ఉన్నాయి. ఈ రెండూ కూడా.. విద్యార్థులకు రుణాలిచ్చే బెంగళూరు సంస్థ క్రేజీ బీలో ఇన్వెస్ట్‌ చేశాయి. 

భారత్‌పై ఎందుకింత మక్కువంటే..
కొన్నాళ్లుగా చైనాలో రిటైల్‌ రుణాల కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఇరెండై, హెక్సిండై లాంటి ఫిన్‌టెక్‌ కంపెనీలు ఏకంగా అమెరికా స్టాక్‌ ఎక్సే్ఛంజీల్లో లిస్టయ్యాయి కూడా. డిమాండ్‌ గణనీయంగా ఉండటంతో ఈ తరహా రుణాలపై వడ్డీ రేట్లు వార్షికంగా ఒకోసారి 100 శాతం దాకా ఉంటున్నాయి. అయితే, ఈ విభాగంలో భారీ వృద్ధితో పాటు నియంత్రణ సంస్థల పరంగా పలు సవాళ్లు కూడా తలెత్తుతున్నాయి. వడ్డీ రేట్లపై పరిమితులు, రుణకార్యకలాపాలు ప్రారంభించాలనుకునే స్టార్టప్స్‌కు కొత్తగా లైసెన్సులు జారీ చేయకపోవడం, మొండిబాకీలు పేరుకుపోతుండటం తదితర సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకలాపాల విస్తరణకు చైనా సంస్థలు భారత్‌వైపు చూస్తున్నాయి. ప్రధానంగా వినియోగ వస్తువులపై రుణాలు, ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్స్, ఆర్థిక సంస్థల ప్రమేయం లేకుండా వ్యక్తుల మధ్య రుణ లావాదేవీలకు ఉపయోగపడే (పీ2పీ) ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ మొదలైన వాటిపై చైనా సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. అయితే, భారత మార్కెట్లోనూ కొన్ని పరిమితులున్నాయి. ప్రధానంగా ఇక్కడ నియంత్రణ సంస్థ అజమాయిషీ ఎక్కువ. ఈ తరహా రుణాలపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల లావాదేవీల పరిమాణం కూడా ఒక మోస్తరుగానే ఉంటోంది. పైపెచ్చు పీ2పీ రుణాలపై అనేక పరిమితులున్నాయి. ఇవన్నీ చైనా సంస్థలకు ప్రతిబంధకాలుగా ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top