భారత్‌పై క్యాడ్‌ భారం

CAD Burden on India - Sakshi

రెండో త్త్రెమాసికంలో 7.2 బిలియన్‌ డాలర్లు

ముంబై: భారత్‌పై రెండవ త్రైమాసికంలో (2017–18 జూలై–సెప్టెంబర్‌) కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ) భారం పడింది. ఇది ఏకంగా 7.2 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇదే త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 1.2 శాతం. 2016–17 ఇదే త్రైమాసికంలో క్యాడ్‌ విలువ 3.4 బిలియన్లు మాత్రమే. అప్పటి త్రైమాసిక జీడీపీ విలువలో ఇది 0.6 శాతం. అయితే 2017–18 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ఆ తదుపరి త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) క్యాడ్‌ పరిస్థితి మెరుగుపడటం గమనార్హం. జూన్‌ త్రైమాసికంలో క్యాడ్‌  విలువ 15 బిలియన్‌ డాలర్లుకాగా, జీడీపీతో ఇది 2.5 శాతంగా నమోదయ్యింది.

క్యాడ్‌ అంటే...: దేశంలోకి వచ్చే విదేశీ మారక ద్రవ్యం నుంచి దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్యాన్ని తీసేస్తే మిగిలే నికర విలువే క్యాడ్‌. అంటే కరెంట్‌ ఖాతా లోటన్న మాట. కాకపోతే వీటి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి వచ్చే స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ), విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) మాత్రం మినహాయిస్తారు. ఒకదేశ ఎగుమతుల విలువ కన్నా– దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడమే (వాణిజ్యలోటు) సహజంగా ఆ దేశ క్యాడ్‌ పెరుగుదలకు కారణమవుతుంది. 2017–18 మొదటి 6 నెలల కాలంలో భారత్‌ క్యాడ్‌ జీడీపీలో 1.8 శాతం. 2016–17 ఇదే కాలంలో ఈ రేటు కేవలం 0.4 శాతం. ఇదే కాలంలో భారత్‌ వాణిజ్యలోటు 49.4 బిలియన్‌ డాలర్ల నుంచి 74.8 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

ముడి చమురే ప్రస్తుత సమస్య...: భారత్‌ ప్రధాన దిగుమతి కమోడిటీ అయిన క్రూడ్‌ ధరలు పెరుగుతుండడం ఇప్పుడు ప్రధానంగా ఆందోళనకు కారణమవుతోంది. క్యాడ్‌ పెరిగితే మారకపు విలువ బలహీన పడటం, ధరల పెరుగుదల తత్సబంధ ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల క్రి తం ఇదే విధమైన సమస్యను భారత్‌ ఎదుర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top