మార్కెట్‌ను మెప్పించని ఐటీసీ | Business giant  ITC net profit up 4 percentage | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ను మెప్పించని ఐటీసీ

Jan 24 2019 1:32 AM | Updated on Jan 24 2019 1:32 AM

Business giant  ITC net profit up 4 percentage - Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ, వ్యవసాయోత్పత్తుల విభాగాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వ్యాపార దిగ్గజం ఐటీసీ నికర లాభం 4 శాతం పెరిగి రూ. 3,209 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌– డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 3,090 కోట్లు. ‘క్యూ3లో స్థూల ఆదాయం రూ. 15 శాతం పెరిగి రూ. 9,853 కోట్ల నుంచి రూ.11,340 కోట్లకు చేరింది. ఎఫ్‌ఎంసీజీ, అగ్రి బిజినెస్, పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్‌ తదితర విభాగాలు రాణించడం ఇందుకు తోడ్పడింది‘ అని ఐటీసీ పేర్కొంది.

సిగరెట్స్‌ విభాగంలో పెను సవాళ్లు ఎదురైనప్పటికీ పరిశ్రమలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగామని ఐటీసీ తెలిపింది. మూడో త్రైమాసికంలో వ్యయాలు 17% పెరిగి రూ. 7,446 కోట్లకు చేరాయి. స్థూల లాభం 11.2 శాతం పెరిగినా.. అధిక వ్యయాల కారణంగా మార్జిన్లు 39.8 శాతం నుంచి 38.5 శాతానికి తగ్గాయి. పరిశ్రమవర్గాలు 40 శాతంగా ఉండొచ్చని అంచనా వేశాయి. మొత్తం మీద ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించలేకపోవడంతో ఐటీసీ షేరు దాదాపు 4 శాతం క్షీణించి రూ. 277.70 వద్ద క్లోజయ్యింది.  

విభాగాలవారీగా ఆదాయాలు చూస్తే .. 
►మొత్తం ఎఫ్‌ఎంసీజీ వ్యాపార ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 7,501 కోట్ల నుంచి రూ. 8,274 కోట్లకు పెరిగింది. ఇందులో సిగరెట్స్‌ వ్యాపార విభాగం ఆదాయం సుమారు 10 శాతం పెరిగి రూ. 5,073 కోట్లకు చేరింది. ఇతరత్రా ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విభాగం 11% పెరిగి రూ. 3,201 కోట్లకు చేరింది. 

►ఐటీసీ హోటల్‌ వ్యాపార ఆదాయం 12 శాతం పెరిగి రూ. 452 కోట్లకు చేరింది. సగటు రూమ్‌ రేటు (ఏఆర్‌ఆర్‌) మెరుగుపడటం దీనికి తోడ్పడింది. 

►అగ్రిబిజినెస్‌ వ్యాపార విభాగం 26 శాతం ఎగిసి రూ. 1,531 కోట్ల నుంచి రూ.1,925 కోట్లకు చేరింది.  

►పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్‌ విభాగం ఆదాయం 21 శాతం పెరిగి రూ. 1,543 కోట్లుగా నమోదైంది.  
ఇన్వెస్టర్లను మెప్పించలేకపోవటంతో ఫలితాల వెల్లడి అనంతరం ఐటీసీ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. షేరు ఏకంగా 4 శాతానికి పైగా పతనమై రూ.277.70 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement