
సిమెంటు రంగంలో 8 శాతం వృద్ధి
దేశవ్యాప్తంగా ఒక కోటి అందుబాటు గృహాల నిర్మాణం, 99 స్మార్ట్ సిటీస్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 2 కోట్ల టాయిలెట్ల నిర్మాణంతో సిమెంటు పరిశ్రమకు మంచి రోజులే. ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుకు కావాల్సిన నిధులు సమకూర్చి సకాలంలో పూర్తి చేయాలి.
ఇదే జరిగితే సిమెంటు రంగంలో 8% వృద్ధి ఆశించొచ్చు. అంటే సుమారు 55 లక్షల టన్నుల సిమెంటు అధికంగా వినియోగం అవుతుంది. ప్రస్తుతం దేశంలో సిమెంటు పరిశ్రమ వృద్ధి 6% లోపు ఉంది. అలాగే 28% ఉన్న జీఎస్టీని 18%కి తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది.
–ఎం.రవీందర్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్, భారతి సిమెంట్
నేషనల్ హెల్త్ పాలసీ విప్లవాత్మక చర్య
నేషనల్ హెల్త్ పాలసీ కింద 50 కోట్ల మందికి ఆరోగ్య బీమాను అందించడం అత్యంత విప్లవాత్మక చర్య. ఒకవేళ దీన్ని కచ్చితంగా అమలుచేస్తే దేశ ప్రజల ఆరోగ్య స్థితిగతులు మారిపోతాయి. వయో వృద్ధులకు పన్ను ప్రయోజనాలు అందించడం మంచి చర్య. మార్కెట్లు జోరు నేపథ్యంలో 10 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. రూ. 250 కోట్ల దాకా టర్నోవరు ఉన్న సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి తగ్గించడం వల్ల మిడ్‌క్యాప్ రంగం వృద్ధి చెందుతుంది. –ప్రీతా రెడ్డి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్
జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా
జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా బడ్జెట్ ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, ఇన్‌ఫ్రా, సీనియర్ సిటిజన్స్‌పై కేంద్రం అధికదృష్టి కేంద్రీకరించింది. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రతికూలమైనది.
–ధీరజ్ రెల్లి, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ చీఫ్
సామాన్యుడికి ప్రాధాన్యం...
సామాన్యుడే లక్ష్యంగా గ్రామీణ, ఆరోగ్య, ఇన్సూరెన్స్ రంగాల వృద్ధికి దోహదపడేలా చర్యలు ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈలకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది. ఐటీ రంగానికి వస్తే స్మార్ట్ సిటీలు, ఫిన్‌టెక్‌లకు ప్రాధాన్యం వంటి వాటి గురించి చెప్పుకోవాలి. –సి.పి.గుర్నాని, టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో
బడ్జెట్‌కు 9/10 రేటింగ్
ఇది ‘ఆల్ ఇన్’ బడ్జెట్. స్థిర వృద్ధికి దోహదపడేలా ఉంది. దాదాపు చాలా అంశాను ప్రస్తావించారు. నేషనల్ హెల్త్ స్కీమ్, కార్పొరేట్ ట్యాక్స్, వ్యవసాయం, గ్రామీణ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. ఉపాధికి ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలు ఇచ్చారు. –రాణా కపూర్, యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో
గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించడం ఆహ్వానించదగినది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం విప్లవాత్మమైన మార్పులకు నాందికానుంది. నేషనల్ హెల్త్ స్కీమ్ వల్ల 10 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందానున్నాయి. మొత్తంగా చూస్తే ఇది ప్రగతిశీల బడ్జెట్. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గుదలను రూ. 250 కోట్ల దాకా టర్నోవరు ఉన్న సంస్థలకు మాత్రమే వర్తింపజేయడం కొంత నిరాశ కలిగించింది. –సతీశ్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్