ప్రణాళిక ఉంటే ఫండింగ్ | Sakshi
Sakshi News home page

ప్రణాళిక ఉంటే ఫండింగ్

Published Sat, Dec 27 2014 12:10 AM

ప్రణాళిక ఉంటే ఫండింగ్

వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం ఫౌండర్ స్వామి విజ్ఞానానంద

పెట్టుబడులతో హిందూ పారిశ్రామికవేత్తలు
చక్కని వ్యాపార ప్రణాళికైతే నిధులు
సభ్యుల అనుసంధానానికి వెబ్‌సైట్

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
హిందూ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌కు నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు సైతం ముందుకు వస్తున్నాయి. ఫండ్ ఏర్పాటుకు ప్రపంచ దేశాల్లోని హిందూ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే సుముఖంగా ఉన్నారు. ఆర్‌బీఐ నిబంధనల నేపథ్యంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఫండ్ స్థాపించే పనిలో నిమగ్నమయ్యామని వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం వ్యవస్థాపకులు స్వామి విజ్ఞానానంద తెలిపారు. హిందూ ఉమెన్ ఫోరం కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. 2015 డిసెంబర్‌కల్లా ఫండ్ కార్యరూపంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఆయనింకా ఏమన్నారంటే..

బ్యాంకుల్లో వాటా..
హిందూ పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలంటే పెట్టుబడి అవసరం. వీసీ ఫండ్ ఏర్పాటు చేసి ఔత్సాహికులకు నిధులు సమకూర్చాలన్నది సభ్యుల ఆలోచన. హిందూ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఉండాలని కూడా కొందరు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే లెసైన్సు పొందడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో నిధుల లేమితో ఉన్న బ్యాంకులో పెట్టుబడి పెట్టాలన్న ప్రతిపాదన కూడా సభ్యుల నుంచి వస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే మేము వాటా పొందే బ్యాంకు ఆరోగ్యకరమైన బ్యాంకుగా కార్యకలాపాలు సాగించగలదు. ఫండ్ రూపు రేఖలు, బ్యాంకులో పెట్టుబడి అంశాలపై మార్చికల్లా స్పష్టత వస్తుంది.
 
సభ్యుల్లో 40 శాతం మంది రెడీ..
ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరంలో 4,000 మందికిపైగా సభ్యులున్నారు. వీరిలో 40 శాతంపైగా సభ్యులు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. స్టార్టప్ కంపెనీలు ఉన్నత స్థితికి చేరాలి. చక్కని వ్యాపార ప్రణాళిక ఉంటే చాలు. ప్రణాళికను వ్యాపారంగా మలుస్తామని సభ్యులు అంటున్నారు.

ఇక్కడి వ్యాపారవేత్తలు ప్రపంచ దేశాలకు విస్తరించాలన్నది ఫోరం ఆశయం. యువతను వ్యాపారాల వైపు నడిపిస్తాం. ఉత్పత్తుల మార్కెటింగ్‌తోపాటు వీరికి శిక్షణ ఇవ్వడానికి, వెన్నంటి నడిపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ప్రపంచ జీడీపీలో హిందూ సమాజం వాటా ప్రస్తుతం 3-4 శాతం లోపే ఉంది. దీనిని 20-25 ఏళ్లలో 16 శాతానికి చేర్చాలన్నది మా లక్ష్యం.  
 
అనుసంధానానికి వెబ్‌సైట్..
సభ్యుల అనుసంధానానికి వెబ్‌సైట్ ఒకదానిని రూపొందిస్తున్నాం. కొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా సభ్యులతో భాగస్వామ్యానికి వెబ్‌సైట్ చక్కని వేదిక కానుంది. ఏ రంగంలో ప్రవేశించాలన్నా ఫోరం ద్వారా సూచనలు చేస్తాం. భవిష్యత్‌లో అవకాశాలు మెరుగ్గా ఉన్న విభాగాల పై దృష్టిసారించాలని సభ్యులకు చెబుతున్నాం.

ఇప్పటికే సభ్యుల మధ్య సంయుక్త భాగస్వామ్య కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఎన్నో విజయవంతమయ్యాయి కూడా. నవంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన ఫోరం అంతర్జాతీయ సదస్సు విజయవంతమైంది. అనూహ్యంగా 53 దేశాల నుంచి 1,800 పైగా సభ్యులు హాజరు కావడంతో ఫోరం మరింత ఉత్సాహంగా ఉంది. ఢిల్లీలో కార్యాలయాన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నాం.

Advertisement
 
Advertisement
 
Advertisement