ఎన్నికల ముందు మోదీకి కొత్త తంటా

Ahead of Gujarat, Himachal polls, Centre has a new headache - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి కొత్త తంటాలు ఎదురుకాబోతున్నాయి. ఆయిల్‌ ధరలు బ్యారెల్‌కు 60 డాలర్లకు చేరుకోబోతున్నాయి. ఉత్తర సముద్ర బ్రెంట్‌లో ఆయిల్‌ ధరలు శుక్రవారం బ్యారల్‌కు 59.30 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. గురువారమైతే ఈ ధరలు 59.55 డాలర్ల మార్కును తాకి  2015 నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేశాయి. దీంతో అత్యధిక మొత్తంలో దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్‌కు ఇవి అగ్నిపరీక్షలా నిలుస్తున్నాయి. భారత్‌ 82 శాతం ఆయిల్‌ అవసరాలను దిగుమతుల ద్వారానే నెరవేర్చుకుంటోంది. దేశీయ బాస్కెట్‌లో ఆయిల్‌ ధరలు బ్యారల్‌కు గురువారం 56.92 డాలర్లుగా నమోదయ్యాయి. సోమవారం వరకు ఈ ధరలు 60 డాలర్ల మార్కును చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా రోజువారీ ధరల సమీక్ష ఉండటంతో, వినియోగదారులపై కూడా ఈ ధరల పెంపు భారం అధికంగా పడుతోంది. 

ఆగస్టు నుంచి కూడా వినియోగదారులు ఆయిల్‌కు అత్యధిక మొత్తంలో చెల్లిస్తూ ఉన్నారు. అక్టోబర్‌ 3 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో, కేంద్రప్రభుత్వం ఇటీవలే ఎక్సైజ్‌ డ్యూటీకి కోత పెట్టింది. ఎక్సైజ్‌ డ్యూటీ కోత మేర రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని ప్రభుత్వం కోరింది. కొన్ని రాష్ట్రాలు ఈ మేరకు వ్యాట్‌ శాతాలను తగ్గించాయి. కానీ ప్రస్తుతం ఆయిల్‌ ధరలు అంతర్జాతీయంగా మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు మళ్లీ పన్ను కోతలను కోరవచ్చు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి మింగుడు పడని అంశమే. ఒకవేళ పన్నుల్లో కోత పెడితే ప్రభుత్వం ఆదాయాలకు గండికొడుతోంది. కానీ తగ్గించపోతే, ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి రావొచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top