‘ప్యాసింజర్‌ సెగ్మెంట్‌’పై పట్టు సాధిస్తాం

'Tata Motors car customers are getting younger'

 2020 నాటికి అన్ని విభాగాల్లో మోడళ్లు

చిన్న పట్టణాల్లోనూ ఔట్‌లెట్ల ఏర్పాటు

టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ మయంక్‌ పరీక్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్యాసింజర్‌ కార్ల విపణిలో 81 శాతం వాటా వ్యక్తిగత కస్టమర్లదే. ఈ అంశమే వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ను తన వ్యూహాలపై పునరాలోచించుకునేలా చేసింది. అందుకే యువ కస్టమర్ల అభిరుచులకు పెద్దపీట వేస్తూ మోడళ్ల ఆవిష్కరణలను ఈ సంస్థ వేగవంతం చేసింది. 16 నెలల్లోనే నాలుగు కొత్త కార్లను మార్కెట్లోకి తెచ్చింది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ నెక్సన్‌ చేరికతో విభాగాల వారీగా మార్కెట్‌ కవరేజ్‌ 71 శాతానికి చేరింది.

మిగిలిన అన్ని విభాగాల్లో మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా 2020 నాటికి 95 శాతం మార్కెట్‌ను కవర్‌ చేస్తామని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ మయంక్‌ పరీక్‌ సోమవారం చెప్పారు. హైదరాబాద్‌లో నెక్సన్‌ మోడల్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ప్లాట్‌ఫామ్స్‌కు పరిమితమై పెద్ద సైజులో ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్, సెడాన్‌ కార్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలియజేశారు.

సొంత కారు అవసరమే..
‘‘వ్యక్తుల ఆదాయాలు పెరుగుతున్నాయి. అందుబాటు ధరలో కార్లు లభిస్తున్నాయి. దీంతో కస్టమర్లు సొంత కారుకు మొగ్గు చూపుతున్నారు. ఆఫీసుకు క్యాబ్‌లో వెళ్లినా, వారాంతాల్లో కుటుంబంతో షికారుకు సొంత కారులో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. యువ కస్టమర్లు అయితే అయిదేళ్లలో ఈఎంఐ పూర్తి కాగానే పాత కారు అమ్మేసి కొత్తది కొంటున్నారు’’ అని మయంక్‌ వివరించారు.

2016 అక్టోబరు నుంచి చూస్తే వాహన విక్రయాల్లో ట్యాక్సీ అగ్రిగేటర్ల వాటా 50 శాతం తగ్గిందని తెలియజేశారు. డ్రైవర్‌ ఓనర్లకు ట్యాక్సీ అగ్రిగేటర్లు ఇస్తున్న ప్రోత్సాహకాలు భారీగా తగ్గడమే ఇందుకు కారణమని చెప్పారు. నెలకు రూ.80,000 దాకా సంపాదించిన డ్రైవర్‌ ఓనర్ల ఆదాయం ఇప్పుడు రూ.30 వేలకు వచ్చిందని తెలియజేశారాయన. మొత్తం విపణిలో ట్యాక్సీల వాటా 12 శాతం కాగా... ఇందులో సగం కార్లు ట్యాక్సీ అగ్రిగేటర్ల వద్ద ఉన్నాయి.

ఈ ఏడాది రెండు లక్షల కార్లు...
గడిచిన 5 నెలల్లో భారత ప్యాసింజర్‌ కార్ల మార్కెట్‌ 8%వృద్ధి చెందిందని, కొత్త శ్రేణి రాకతో టాటా మోటార్స్‌ 11% వృద్ధిని నమోదు చేసిందని మయంక్‌ వెల్లడించారు. ‘2016–17లో కంపెనీ భారత్‌లో 1.52 లక్షల కార్లను విక్రయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల యూనిట్లను విక్రయిస్తామని అంచనా.

సుస్థిర వాటా దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశాం. ప్రస్తుతం 745 ఔట్‌లెట్లున్నాయి. వీటిని 2020 నాటికి 1,200కు చేరుస్తాం. చిన్న పట్టణాలకు ప్రత్యేక షోరూంలు తెరుస్తాం. ఒక్కో గ్రామంలో ఒకరిద్దరు కస్టమర్లు అయినా ఉంటారు. అందుకే 10–15 కిలోమీటర్ల దూరంలోపే ఔట్‌లెట్, 5 కిలోమీటర్లలోపే సర్వీస్‌ కేంద్రం ఉండాలన్నది మా లక్ష్యం. మార్కెట్‌ సిద్ధం కాగానే ఎలక్ట్రిక్‌ కారును ప్రవేశపెడతాం’’ అని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top