కీలక అవరోధశ్రేణి 36,285–36,560

18 stocks rise 10-50% even as Sensex falls 1% in 5 days - Sakshi

మార్కెట్‌ పంచాంగం

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చే ప్రకటన గత శుక్రవారం వెలువడింది. ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపు అంశాల్లో మార్కెట్ల భయాందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని, తమ పాలసీ ఫైనాన్షియల్‌ మార్కెట్లకు ఇబ్బందిగా పరిణమిస్తున్నదని భావిస్తే పాలసీని సమీక్షిస్తామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ చేసిన ప్రకటనతో అమెరికా, యూరప్‌ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపాయి. ఈ బాటలోనే ఆసియా ఇండెక్స్‌ ఫ్యూచర్లు భారీగా పెరిగాయి. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్‌ తాజా ప్రకటనతో భారత్‌ మార్కెట్‌లో పెట్టుబడుల్ని పునర్‌ప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించగలదు.  ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే...  

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
జనవరి 4తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారం ప్రధమార్థంలో 36,285 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ద్వితీయార్థంలో వేగంగా 35,382 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 382 పాయింట్ల నష్టంతో 35,695  పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్‌ భారీ ర్యాలీ ఫలితంగా ఈ వారం గ్యాప్‌అప్‌తో మార్కెట్‌ మొదలైతే సెన్సెక్స్‌కు 36,235 పాయింట్ల వద్ద తక్షణఅవరోధం కలగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్‌ భవిష్యత్‌ ట్రెండ్‌కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు.   ఈ వారం పైన ప్రస్తావించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్‌ నిస్తేజంగా ప్రారంభమైనా 35,380 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తొలి మద్దతు లభిస్తున్నది.  ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే క్రమేపీ 34,400 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు.   

నిఫ్టీ కీలక నిరోధశ్రేణి 10925–10,985
గతవారం 10,924 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 10,629 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 133 పాయింట్ల నష్టంతో 10,727  వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే 10,895 పాయింట్ల వద్ద తక్షణ అవరోధం కలగవచ్చు. అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుంది.   ఈ స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 11,035–11,150  శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు.  ఈ వారం పైన సూచించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,630 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 10,535  స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు.  అటుపై కొద్దిరోజుల్లో 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగే ప్రమాదం ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top