ఏసీ మార్కెట్‌ వృద్ధి 10 శాతమే! 

10pc share in AC market in 5 years - Sakshi

వచ్చే రెండేళ్లూ ఇదే స్థాయిలో  ఉండే అవకాశం

ఈ ఏడాది 60 లక్షల యూనిట్లు విక్రయించే అవకాశం

జీఎస్‌టీ తగ్గిస్తే మాత్రం మార్కెట్‌కు మరింత జోష్‌

తయారీ కంపెనీల అంచనాలు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గడిచిన కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఏసీల డిమాండ్‌ను అంతకంతకూ పెంచుతుండగా... దేశంలో మాత్రం వీటిపై 28 శాతం జీఎస్‌టీ విధిస్తుండటం అమ్మకాల జోరుకు కొంత అడ్డుకట్ట వేస్తున్నట్లుగానే భావించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏటా రూ.14,000 కోట్ల విలువైన ఏసీలు అమ్ముడుపోతున్నాయి. సంఖ్యలో చూస్తే... 2017–18లో 55 లక్షల యూనిట్లు విక్రయం కాగా... ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకూ వృద్ధి ఉండవచ్చని, ఇది 60 లక్షల యూనిట్లకు చేరవచ్చని బ్లూస్టార్‌ జేఎండీ త్యాగరాజన్‌ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరోతో చెప్పారు. 2019–20లో ఇవి 66 లక్షల యూనిట్లను చేరవచ్చన్నారు. మార్కెట్‌ వృద్ధి 10 శాతం వరకూ ఉంటే... బ్లూస్టార్‌ కూడా అదే స్థాయి వృద్ధిని లకి‡్ష్యస్తున్నట్లు చెప్పారాయన. జీఎస్‌టీని తగ్గిస్తే మాత్రం ఈ వృద్ధి మరింత పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.
 
తగ్గిన విండో... పెరిగిన ఇన్వర్టర్‌: విద్యుత్‌ను ఆదా చేసే ఇన్వర్టర్‌ ఏసీల వార్షిక వృద్ధి 100 శాతం దాటిపోతుండగా... విండో ఏసీల వాటా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం ఏసీల్లో విండో శ్రేణి వాటా 12 శాతం ఉండగా... 88 శాతం స్ప్లిట్‌ ఏసీలే ఉన్నాయి. ఇందులో మల్టీ స్ప్లిట్‌ వాటా 2 శాతం. స్ప్లిట్‌ ఏసీల్లో ఇన్వర్టర్‌ విభాగం 52 శాతం, ఫిక్స్‌డ్‌ స్పీడ్‌ మోడళ్లు 47 శాతం ఉన్నాయి. 2016లో ఇన్వర్టర్‌ ఏసీల వాటా 10 శాతం మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో విండో ఏసీల అమ్మకాలు పూర్తిగా పడిపోయినట్లు విక్రేతలు చెబుతున్నారు.   

ఎక్కువగా 3 స్టార్‌.. 
విక్రయమవుతున్న ఏసీల్లో 5 స్టార్‌ మోడళ్ల వాటా 14 శాతంగా ఉంది. 82 శాతం వాటా మాత్రం 3 స్టార్‌దే. 5 స్టార్‌తో పోలిస్తే 3 స్టార్‌ మోడళ్ల ధర కనీసం రూ.5 వేలు తక్కువగా ఉండటమే దీనికి కారణమని, ఏసీని ఎక్కువగా వాడేవారు మాత్రమే విద్యుత్‌ ఆదా కోసం 5 స్టార్‌ వైపు మొగ్గు చూపుతున్నారని టీఎంసీకి చెందిన కె.శ్రీనివాస్‌ చెప్పారు. ‘‘తెలంగాణ, ఏపీ కస్టమర్లకు విద్యుత్‌ ఆదా విషయంలో అవగాహన ఎక్కువ. ఈ రెండు రాష్ట్రాల్లో ఇన్వర్టర్‌ ఏసీల అమ్మకాలు 90 శాతం ఉంటున్నాయి’’ అని సోనోవిజన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ భాస్కరమూర్తి చెప్పారు. 5 స్టార్‌ సేల్స్‌ దేశంలో ఇక్కడే ఎక్కువన్నారాయన. కాగా ఏసీ విక్రయాల్లో 30–35 శాతం ఈఎంఐల ద్వారా జరుగుతున్నాయని గోద్రెజ్‌ చెబుతోంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top