
సాక్షి, అనంతపురం : హిందూపురం వైఎస్సార్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ శనివారం కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీరు అనైతికమని, ప్రజలను అభద్రతా భావానికి గురిచేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా రెడ్‌జోన్లలో పర్యటిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు కూడా ప్రజలకు సేవ చేస్తున్నాయని చెప్పారు. టీడీపీ నేతలు ఇంట్లో కూర్చొని ఆరోపణలు చేయటం తగదని హితవు పలికారు. ( కరోనా: కొత్త అవతారం ఎత్తిన ఏసీ బస్సులు )
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా వైరస్ పరీక్షల సామర్థ్యం పెంచారని, దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ కిట్లు తెప్పించారని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి 1000 రూపాయల నగదు ఇచ్చి ఆదుకున్నారని, మూడు సార్లు పేదలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేశారని చెప్పారు.