27న ఢిల్లీలో వంచనపై గర్జన  

YSRCP Leaders Will Protests On 27th December About Special Status - Sakshi

హోదా కోసం ఢిల్లీలో మరోమారు గర్జించనున్న వైఎస్సార్‌సీపీ  

ప్రజాసంకల్పయాత్ర జనవరి 9, 10 తేదీల్లో ముగుస్తుంది 

మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు బొత్స, సజ్జల 

సాక్షి, అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి మాట తప్పిన పార్టీలను నిలదీస్తూ నాలుగున్నరేళ్లుగా నిరంతర ఉద్యమాలు నిర్వహించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఢిల్లీ వేదికగా గర్జించనుంది. ఈనెల 27న ఢిల్లీలో వంచనపై గర్జన నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పల్లె నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా ఇవ్వాలంటూ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలతో త్యాగాలు చేశారని వివరించారు. మరోమారు 27న ఢిల్లీలో నిర్వహించే వంచనపై గర్జన దీక్షకు రాష్ట్రం నుంచి పార్టీ ముఖ్యనేతలతోపాటు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు తరలివెళ్లనున్నట్టు చెప్పారు.   

ఇచ్చాపురంలో ముగియనున్న పాదయాత్ర  
ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వచ్చే నెల 9 లేదా 10వ తేదీన ఇచ్చాపురంలో ముగుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోను జనవరి 5, 6, 7 తేదీల్లో పాదయాత్రలు నిర్వహించనున్నట్టు తెలిపారు.  నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటే ముస్లీం మైనార్టీలకు ప్రేమాభిమానాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎంఐఎం నాయకుడు ఓవైసీకి వైఎస్‌ అంటే ఎంతో అభిమానం ఉందని, జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఎంపీగా పనిచేశారని గుర్తు చేశారు. అదే అభిమానంతో జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ఏపీలో ప్రచారం చేస్తానని ఓవైసీ ప్రకటించారని, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బొత్స, సజ్జల చెప్పారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top