మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు

YSRCP Leaders Hold Rally Support Three Capital Proposal - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం కార్యరూపం దాల్చాలంటూ నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అధ్వర్యంలో మానవహారాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని.. రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని పలువురు నాయకులు పేర్కొన్నారు. 

విశాఖపట్నం: అధికార, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయొద్దని ప్రజలు కోరారు. అలాగే ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న కుట్రలపై మండిపడ్డారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించాలని కోరుతూ గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, పశ్చిమ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్, బెహరా భాస్కరరావు, శ్రీధర్ అప్పలనాయుడు  పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, మహిళ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

జి.మాడుగుల: మూడు రాజధానులతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాల నాయుడు అన్నారు. జి.మాడుగులలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచన అభినందనీయమన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి కంటే సొంత అభివృద్ధే ముఖ్యమని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదన్నారు.

అనకాపల్లి: విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించాలని కోరుతూ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు దిలీప్‌కుమార్‌, డాక్టర్‌ విష్ణుమూర్తి, మందపాటి జానకిరామ రాజు, గొర్లి సూరిబాబు, జాజుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం: అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేల సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ దాకా భారీ ప్రదర్శన నిర్వహించారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీలను ఆమోదించాలని నినాదాలు చేశారు. ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు ఉద్యమిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి మంత్రి శంకర్ నారాయణ సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఇక్భాల్, వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరా, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు. 

తూర్పుగోదావరి: ఒక రాజధాని వద్దు.. 3 రాజధానులు ముద్దు అంటూ రాజమండ్రి ఎంపీ భరత్ ఆధ్వర్యంలో కోటగుమ్మం జంక్షన్ నుంచి డీలక్స్ సెంటర్ వరకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

అమలాపురం: మూడు రాజధానులు ముద్దు..ఒకే రాజధాని వద్దు అంటూ అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ భారీ ర్యాలీ ప్రారంభించారు. పట్టణంలోని మూడు కూడళ్ల నుంచి వేల మంది గడియారపు స్తంభం జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి మూడు రాజధానులు అవసరమంటూ నినాదాలు చేశారు.

కర్నూలు: ఆలూరులో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా విద్యార్థులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, హాఫీజ్‌ఖాన్‌, వైఎస్సార్‌సీపీ నేత బివై రామయ్య పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి: సీఎం జగన్‌ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చంద్రబాబుకు నిరసన సెగ..
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజల నిరసన సెగ తగిలింది. తాడేపల్లిగూడెంలో బాదంపూడి జంక్షన్‌ వద్ద బస్సు యాత్రగా వెళ్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్‌ బాబు’ నినాదాలతో తాడేపల్లిగూడెం ప్రజలు నిరసన తెలిపారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top