
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపద్దాలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెనుకొండ సమన్వయ కర్త శంకర్ నారాయణ, రాప్తాడు సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పుట్టపర్తి సమన్వయ కర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కియా కారు ప్రారంభం అంటూ డ్రామాలు ఆడటము ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఎక్కడో తయారైన కారును తీసుకువచ్చి లాంచింగ్ అనడం మన దౌర్భాగ్యమన్నారు.
కియా ప్రాంతంలో రైతులను ఆదుకుని, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు మోసం చేశాడని మండిపడ్డారు. మసిపూసి మారేడు కాయ చేసి అనంత ప్రజలను నిండాముంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా పేరుతో చేసిన మోసాలు, అవినీతిపై వచ్చే నెల నాలుగవ తేదిన వైఎస్సార్ సీపీ.. ప్రజల తరపున ఉద్యమం చేపడతుందని వెల్లడించారు. రైతులకు, నిరుద్యోగులకు న్యాయం చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.