
‘బాబు కమీషన్లు దక్కితే చాలనుకుంటున్నారు’
పోలవరంపై తాము లేవనెత్తిన అనుమానాలు నిజమయ్యాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం వ్యయమంతా కేంద్రమే భరించాలని చెప్పారు.
హైదరాబాద్: పోలవరంపై తాము లేవనెత్తిన అనుమానాలు నిజమయ్యాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం వ్యయమంతా కేంద్రమే భరించాలని చెప్పారు. అనుమతులన్నీ కేంద్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడతుందని చంద్రబాబునాయుడు ప్రకటించారని మండిపడ్డారు.
ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.42వేల కోట్లకు చేరిందని, కేంద్రం మాత్రం 2014నాటి వ్యయాన్ని మాత్రమే భరిస్తామని చెబుతోందని అన్నారు. చంద్రబాబుకు వాస్తవాలు తెలిసినా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తికావడం పట్టించుకోకుండా తనకు కమీషన్లు దక్కితే చాలన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. పెరిగిన అంచనా వ్యయాన్ని ఎవురు భరిస్తారో చెప్పడం లేదని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు.