
రుణమాఫీకి ముహూర్తం పెట్టించండి
టీడీపీ అధికారంలోకి రాగానే పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలోకి రాగానే పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా రుణమాఫీకి ముహూర్తం పెట్టించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ ఎప్పుడు చేసేదీ అసెంబ్లీలో ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన కోరారు. మన రాష్ట్రంలో తొలి సంతకాలకు అత్యంత ప్రాధాన్యం ఉందని, గతంలో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి తాము ఇచ్చిన హామీల మేరకు ప్రమాణ స్వీకారం వేదికమీదే తొలి సంతకాలు చేయడమే కాక.. వాటిని తక్షణం అమలుచేశారని, తొలి సంతకాలకు అంత ప్రాధాన్యం, పవిత్రత ఉన్నాయని శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఆ పవిత్రతకు భంగం కలిగించొద్దని, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయద్దని అన్నారు.
ఇక తమ ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తోందని చంద్రబాబు, టీడీపీ నాయకులు అంటున్నారని, కానీ స్థానిక ఎన్నికలు పూర్తయ్యి ఇంత కాలమైనా.. ఇప్పటివరకు జడ్పీ, మునిసిపల్ ఛైర్మన్ల పదవుల ఎన్నికకు తేదీ ప్రకటించలేదేమని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో విభజన చట్టంపై స్పష్టత లేదన్నారని, కానీ ఇప్పుడు గెలిచినవాళ్లంతా రోడ్డుమీద ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము స్థానిక ప్రజా ప్రతినిధులమేనా, అసలు తమకు పదవులున్నాయా అని వారు ప్రశ్నిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల మీద ఎందుకు స్పష్టత లేదని, తక్షణం కేంద్ర హోం శాఖతో మాట్లాడి ఎన్నికల సంఘానికి తగిన సూచనలు చేయాలని డిమాండ్ చేశారు.