అర్ధరాత్రివేళ వైఎస్సార్, విగ్రహాల తొలగింపు | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రివేళ వైఎస్సార్, ఎన్టీఆర్‌ విగ్రహాల తొలగింపు

Published Mon, Jul 16 2018 12:27 PM

YSR And NTR Statues Removes Midnight In Guntur - Sakshi

పిడుగురాళ్లటౌన్‌(గురజాల): పట్టణంలోని ఐలాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహాలను శనివారం అర్ధరాత్రి అధి కారులు దగ్గరుండి తొలగించారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్నాయని విగ్రహాలను తొలగించారు. ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ నాయకులతో విగ్రహాల తొలగింపుపై అధికారులు సమావేశమయ్యారు. అన్ని రకాల అనుమతులు తీసుకుని ప్రతిష్టించిన వైఎస్సార్‌ విగ్రహం తొలగింపునకు నాయకులు అంగీకరించలేదు. ఎన్టీఆర్‌ విగ్రహ దాత టీడీపీలో లేకపోవడంతో ఆ గ్రహాన్ని తొలగించేందుకు ఆ పార్టీ నాయకులు అంగీకరించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడానికి అంగీకారం లేకపోవడంతో అధికారులు శనివారం అర్ధరాత్రి వేళ విగ్రహాల తొలగిపునకు పూనుకున్నారు. తహసీల్దార్‌ రవి బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ కాసు శివరామిరెడ్డి, పట్టణ సీఐ ఎం హనుమంతరావు దగ్గరుండి విగ్రహాలను తొలగింపును పర్యవేక్షించారు. తొలగించిన విగ్రహాలను ఆర్‌అండ్‌బీ బంగ్లా ప్రాంగణంలోకి తరలించారు. విగ్రహాల దిమ్మెలు పటిష్టంగా ఉండంతో వాటిని తొలగించలేదు.

వైఎస్‌ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టిస్తాం : కాసు
అర్ధరాత్రివేళ ఎవరూలేకుండా దొంగతనంగా విగ్రహాల తొలగించడం ఏమిటని వైఎస్సార్‌ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌ రెడ్డి విమర్శించారు. విగ్రహాలు తొలగించిన ప్రదేశాన్ని ఆయన ఆదివారం పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. అన్ని అనుమతులు  తీసుకున్న తరువాత ట్రాఫిక్‌కు ఇబ్బందిగా లేదని నిర్ధారించాక, కలెక్టర్‌ ఆదేశాలతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించారని గుర్తుచేశారు. ఇక్కడ ఫౌంటెన్‌ పెడతామంటున్నారని, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్సార్, ఎన్టీఆర్‌ కంటే ఫౌంటన్‌ ఎక్కువా అని ప్రశ్నించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందని చెబితే గురజాల మాదిరిగానే ఇక్కడా విగ్రహం తొలగింపునకు సహకరించేవారిమని అన్నారు. కలెక్టర్‌ ఉత్తర్వులను ఉల్లంఘించిన మునిసిపల్‌ కమిషనర్, ఆర్డీఓపై కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదుచేసి, వారిని సస్పెండ్‌ చేసేవరకు పోరాడతామని స్పష్టంచేశారు. మరో ఆరు నెలల్లో ఇక్కడే వైఎస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు శాశ్వతం కాదన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలని హితవుపలికారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు ఎనుముల మురళీధరరెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు చింతా వెంకటరామారావు, చల్లా పిచ్చిరెడ్డి, నియోజకవర్గ యువజన నాయకుడు జంగా వెంకటకోటయ్య, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ చింతా సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ గండికోట కోటేశ్వరరావు సయ్యద్‌ జబీర్, పెద అగ్రహారం సొసైటీ అధ్యక్షుడు జంగిటి వెంకటకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement