అధికారం కోసం ఎవరినైనా మోసం చేస్తాడు


చంద్రబాబుపై ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజం

- అధికారం కోసం అందరినీ మోసం చేసిన ఘనుడు  

మూడన్నరేళ్లలో లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోచుకున్నాడు

పేదలకు రూ.3 లక్షల ఫ్లాట్‌ను రూ.6 లక్షలకు కట్టబెడతాడట

డబ్బుల మూటలతో వస్తున్నారు.. లౌక్యంగా వ్యవహరించండి

చెప్పింది చేస్తాడన్న విశ్వసనీయతే నాకున్న ఆస్తి 

 

 

నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబు అధికారం కోసం ఎవరినైనా మోసం చేస్తాడు. ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. గత ఎన్నికల్లో గెలవడానికి రైతులు చేసిన రూ.86,612 కోట్ల రుణాలను మాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా అక్క, చెల్లెమ్మలకు సంబంధించి రూ.14 వేల కోట్లను పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. ఓట్ల కోసం చదువుకున్న యువతనూ వదిలి పెట్టలేదు. ఇంటింటికీ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. 38 నెలలుగా ప్రతి ఇంటికి రూ.76 వేల చొప్పున బాకీ పడ్డాడు. అధికారంలోకి రావడం కోసం అన్ని సామాజిక వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు.ముఖ్యమంత్రి హోదాలో కర్నూలుకు వచ్చినపుడు అనేక హామీలు ఇచ్చి జిల్లా ప్రజలను మోసం చేశాడు. ఇచ్చిన హామీల్లో నేటికీ ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చక పోవడం ఆయన మోసకారి తనానికి నిదర్శనం. ముఖ్యమంత్రిగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు అబద్ధాలు ఆడే గొప్ప వ్యక్తి ఆయన ఒక్కడే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఐదవ రోజు ఆదివారం రోడ్‌షో నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌ నుంచి ప్రారంభమై ఏడవ వార్డులోని వెంకప్ప అంగడి మీదుగా 8, 9, 10, 11, 12వ వార్డుల్లో సాగింది. నంద్యాల ఉప ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, నంద్యాల ప్రజలు ధర్మం వైపే నిలబడాలని.. రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి ఇక్కడి నుంచే నాంది పలకాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు రాజకీయ వ్యవస్థను మార్చబోతోంది.. మోసాలు చేసి డబ్బుతో ఓటు కొనుగోలు చేయవచ్చని అనుకునే వారికి బుద్ధి చెప్పేలా ఉంటుంది.. ఈ ఉప ఎన్నిక బరిలో నిలిచిన శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించి మార్పునకు నాంది పలకాలని కోరారు. శ్రీనివాస సెంటర్, గుడిపాటిగడ్డ సెంటర్లలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

 

ఏకగ్రీవానికి అంగీకరించి ఉంటే ఒక్క రూపాయి ఇచ్చేవాడు కాదు..

‘‘ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది కాబట్టే నంద్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.కోట్లు కేటాయించాడు. అదే పోటీ పెట్టకుండా.. ఏకగ్రీవానికి అంగీకరించి ఉంటే.. ఈవేళ నంద్యాల రోడ్లపై ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, వారి కేబినెట్‌ మొత్తం కనిపించేది కాదు. సీనియర్‌ నాయకులు లాడ్జీల్లో తిష్ట వేసేవారు కాదు. అధికారం కోసం ఏ మోసానికైనా సిద్ధపడే చంద్రబాబు.. ఉప ఎన్నికల కోసం తాను మూడున్నరేళ్ల పరిపాలనలో దోచుకున్న లక్షల కోట్ల రూపాయల్లో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు.

 

పేదల ఇల్లు.. అతి పెద్ద స్కాం!

ప్రతీ పేదవాడికి 3 సెంట్ల స్థలం.. పక్కా ఇల్లు కట్టిస్తానన్నాడు. కానీ ఒక్క ఇల్లు కట్టించలేదు. ఇప్పుడు కట్టించబోతున్నానంటున్నాడు. అందులోనూ చంద్రబాబు మార్కు అవినీతి ఉంది. అతిపెద్ద స్కాంకు పక్కాగా స్కెచ్‌ వేశాడు. పేదల కోసం కేవలం రూ.3 లక్షల వ్యయమయ్యే ఫ్లాట్‌ను బాబు రూ.6 లక్షలకు కట్టిస్తానంటున్నాడు. ఒక ఫ్లాట్‌ కట్టడానికి ఒక చదరపు అడుగుకు మహా అయితే రూ.1000 అవుతుంది. చంద్రబాబు కట్టించి ఇస్తానంటున్న 300 చదరపు అడుగుల ఫ్లాట్‌కు రూ.3 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. మిగిలిన రూ.3 లక్షలు పేదల నెత్తిన వేస్తున్నాడు. కేవలం తన మామూళ్ల కోసం ధర రూ.6 లక్షలకు పెంచేశాడు. బినామీ కాంట్రాక్టర్‌కు మాత్రం అడుగుకు రూ.2075 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. దీనిని అభివృద్ధి అంటారా? అభివృద్ధి అంటే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయడం. 

 

లౌక్యంగా వ్యవహరించండి..

చంద్రబాబు తన మూడున్నరేళ్ల పాలనలో ప్రజల నుంచి దోచుకుని అవినీతి డబ్బుల మూటలతో నంద్యాల ఓటర్లను కొనుగోలు చేయడానికి వస్తున్నాడు. ఓటుకు రూ.5 వేల చొప్పున ఇచ్చి.. చేతిలో దేవుని పటం పెట్టి ప్రమాణం చేయిస్తాడు. ఏ దేవుడు పాపానికి ఓటు వేయమని చెప్పడు. దెయ్యాలు మాత్రమే ఆ మాట చెబుతాయి. కాబట్టి మీ వద్దకు తెలుగుదేశం నాయకులు వచ్చినప్పుడు ధర్మం వైపే ఉంటామని మనసులో తలుచుకోండి. దెయ్యాల దగ్గర లౌక్యంగా వ్యవహరించండి. అంతిమంగా మీరు ధర్మానికే ఓటు వేసి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించండి. మోసం చేసే వారిని ప్రజలు కాలరు పట్టుకుని నిలదీస్తారనే భయం రాజకీయ నేతల్లో కలగాలి. అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుంది. 

 

అధికారం కోసం నేను చంద్రబాబులా అబద్ధాలు ఆడను. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం నాకు చేతకాదు. జగన్‌ చెప్పింది చేస్తాడన్న విశ్వసనీయతే నాకున్న ఆస్తి అని గర్వంగా చెప్పగలను. దివంగత నేత రాజశేఖరరెడ్డి నాకు ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబమే నా ఆస్తి. చంద్రబాబులా రైతులను, డ్వాక్రా అక్క చెల్లెమ్మలను, విద్యార్థులను మోసం చేసే గుణం నాలో లేదు. ప్రతి పేదవాడిలో చిరునవ్వు.. రైతుల మొహంలో ఆనందం.. అవకాశం వస్తే తొమ్మిది నవరత్నాలను ప్రతి ఇంటికీ అందించి వారిని బాగుపరుస్తానన్న నమ్మకమే నా ఆస్తి’’ అని జగన్‌ అన్నారు.   
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top