
చంద్రబాబుకు చాలెంజ్
తెలంగాణలో స్టీఫెన్‌సన్‌కు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని తాను టీఆర్‌ఎస్‌కు లేఖ ఇచ్చినట్లు రుజువు చేస్తే తక్షణమే రాజీనామా చేస్తానని, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేస్తారా?
- స్టీఫెన్‌సన్ ఎవరో.. ఆ హోటల్ ఎక్కడుందో నాకు తెలీదు
- కేసీఆర్‌కు నేను లేఖ ఇచ్చానని రుజువుచేస్తే రాజీనామా చేస్తా
- లేదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా?
- అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన జగన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్టీఫెన్‌సన్‌కు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని తాను టీఆర్‌ఎస్‌కు లేఖ ఇచ్చినట్లు రుజువు చేస్తే తక్షణమే రాజీనామా చేస్తానని, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పక్షానికి సవాల్ విసిరారు. మంగళవారం శాసనసభలో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని జగన్‌మోహన్‌రెడ్డి లేఖ ఇవ్వడంవల్లే స్టీఫెన్‌సన్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవి ఇచ్చారని ఆరోపించారు. దాని పై జగన్ ప్రతిస్పందిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
''అచ్చెన్నాయుడుగారూ... టీఆర్‌ఎస్‌కు నేను లేఖ ఇచ్చానా? నేను కేసీఆర్‌కు ఆ లెటరు ఇస్తే... ఆ లెటరు నీకెట్లావచ్చింద య్యా? కేసీఆర్ ఇచ్చారా? ఎవరా స్టీఫెన్‌సన్? ఆ స్టీఫెన్‌సన్ ఎవరో నాకు తెలియదు. ఆ హోటల్ ఎక్కడుందో నాకు తెలీదు. నేను లేఖ ఇచ్చినట్లు రుజువు చెయ్.. రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారా? నేను గట్టిగా సవాల్ విసురుతున్నా. చాలెంజ్... చాలెంజ్.. చాలెంజ్... చంద్రబాబు నాయుడికి, నాకు చాలెంజ్...''అని జగన్ సవాలు విసిరారు.
తాను కోరుకున్నవారిని ఎమ్మెల్సీగా గానీ, రాజ్యసభ సభ్యునిగా గానీ పంపించగలుగుతానని, ఎవరి వద్దకో వెళ్లాల్సిన, ఎవరినో బ్రతిమిలాడాల్సిన అవసరం తనకు లేదని జగన్ స్పష్టం చేశారు. ఇంకా నయం... రేవంత్‌రెడ్డికి డబ్బు ఇచ్చి లంచమిచ్చేందుకు పంపించిందీ, ఆడియో వీడియో టేపుల్లో మాట్లాడిందీ జగనేనని చెప్పలా.. అని ఎద్దేవా చేశారు. ''చంద్రబాబు తెలంగాణలో ఎనిమిదిమంది ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.150 కోట్లు లంచమిచ్చేందుకు బ్లాక్‌మనీ సిద్ధం చేశారు. అందుకే ఓటుకు కోట్లు కేసు చార్జిషీటులో చంద్రబాబు పేరు 22 సార్లు పెట్టారు. కాబట్టే ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఈరోజు ప్రత్యేక హోదాను పణంగా పెట్టి మోదీగారి ముందు చంద్రబాబు నాయుడు సాష్టాంగపడ్డారు'' అని జగన్ ధ్వజమెత్తారు.
టీఆర్‌ఎస్‌లో లాలూచీకి ఆధారాలున్నాయి
అంతకుముందు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని, జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాయడంవల్లే స్టీఫెన్‌సన్‌కు కేసీఆర్ ఎమ్మెల్యే పదవి ఇచ్చారని ఆరోపించారు. 21న గ్రాండ్ హోటల్‌లో స్టీఫెన్‌సన్, టీఆర్‌ఎస్ నాయకుడు హరీష్‌రావుతో జగన్ సమావేశమయ్యారని చెప్పారు. ఈ లాలూచీకి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.