ఆయన ఓ విజ్ఞాన సర్వస్వం 

YS Jagan Comments about DA Somayajulu - Sakshi

సోమయాజులు జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభిభాషణ 

ప్రతి సందర్భంలోనూ నాకు సలహాలిచ్చేవారు 

అసెంబ్లీ ప్రసంగాలలో వెనకుండి నడిపించారు 

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఉన్న డీఏ సోమయాజులు ఇప్పుడు భౌతికంగా లేకపోవడం ఓ లోటు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం సోమయాజులు 67వ జయంతి సందర్భంగా విజయవాడలోని దివెన్యూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమయాజులు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కీర్తిశేషులు సోమయాజులు ఓ ఎన్‌సైక్లోపీడియా (విజ్ఞాన సర్వస్వం) అని అభివర్ణించారు. ఆయనకు ప్రతి అంశంపైనా పూర్తి అవగాహన ఉండేదన్నారు. తాను పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో.. పార్టీని ఎలా నడుపుతారో అనే మీమాంస చాలా మందిలో ఉండేదని, ఆ తరుణంలో తాను దేవుడిని గట్టిగా నమ్మానని, ప్రజలు తోడుగా ఉన్నారని గట్టిగా విశ్వసించేవాడినని చెప్పారు. అలాంటి సమయంలో మొట్టమొదటగా తనతో అడుగులు వేసిన వ్యక్తి సోమయాజులు అని తెలిపారు.

ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ ఆయన తనకు ఒక గురువులాగా ఉండేవారన్నారు. ప్రతి విషయంలోనూ తనకు సూచనలు, సలహాలు ఇచ్చి నడిపించారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా 2014లో మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగు పెట్టినపుడు, ఆ తరువాత ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ తన ప్రసంగాల వెనుక సోమయాజులు ఉండి నడిపించారని తెలిపారు. ఇప్పుడు  సోమయాజులు భౌతికంగా లేక పోవచ్చుకానీ, ఆయన ఎక్కడికీ పోలేదని, మన కళ్లెదుటే ఉన్నాడని చెప్పడానికి ఆయన కుమారుడు కృష్ణను చూసినపుడు తనకు అనిపిస్తుందని వైఎస్‌ జగన్‌ తెలిపారు. తండ్రి మాదిరిగానే అన్ని విషయాల మీద కృష్ణకు పూర్తి అవగాహన ఉందన్నారు. సోమయాజులు కుటుంబానికి ఎల్లప్పుడు తనతో పాటు అంతా తోడుగా ఉంటారని తెలిపారు.  

జగన్‌ చుట్టూ మంచి వాళ్లున్నారు 
కార్యక్రమంలో పాల్గొన్న శాంతా బయోటెక్‌ అధినేత వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ చుట్టూ మంచి అజేయ కల్లం, గౌతం సవాంగ్, కృష్ణ వంటి మంచి ఆలోచనలు గల వారున్నారని ప్రశంసించారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దలకు అన్నీ వివరించి ఉచిత విద్యుత్‌ హామీకి ఒప్పించగలిగారన్నారు. సోమయాజులు మిత్రుడు మోహన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సోమయాజులు ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సోమయాజులు సతీమణి కళ్యాణి, కుమారుడు కృష్ణ, ఆయన సతీమణి సువర్ణ,  ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top