
సాక్షి, వైఎస్సార్ : రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములును ఎన్నటికీ మరువకూడదని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కడపలో ఎంపీ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో మా ప్రభుత్వం ఇప్పటి నుంచి ప్రతి ఏడాది నవంబర్ 1న అవతరణ వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహిస్తోందని తెలిపారు. అలాగే పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను నలుదిశలా వ్యాపించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
గత అయిదు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొట్టి శ్రీరాములును విస్మరించి అవతరణ వేడుకలు నిర్వహించకపోవడం భాదకరమన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాశ్, ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యలు జిల్లా కలెక్టర్ హరికిరణ్‌ను కలిసి సోమశిల ముంపు గ్రామ ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అట్లూరు, గోపవరం మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజల సమస్యలను కూడా పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.