సర్కారి వారి మాట అసత్యాల మూట!

World Bank team about state government on capital city - Sakshi

‘రాజధాని’ కబుర్లపై కుండబద్దలు కొట్టిన ప్రపంచ బ్యాంకు బృందం 

సాక్షి, అమరావతి: రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ అసత్యాలేనని ప్రపంచబ్యాంక్‌ తనిఖీ బృందం నిర్ధారణకు వచ్చింది. భూసమీకరణ(ల్యాండ్‌ పూలింగ్‌) స్వచ్ఛందమంటూ రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏ చెప్పినదాంట్లో వాస్తవం లేదని గ్రహించింది. ఈ విషయంలో ఇన్నాళ్లుగా సీఆర్‌డీఏ చెప్పినదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా ఉందని పేర్కొంది. భూసమీకరణ సందర్భంగా తమను బెదిరించినట్టు, భయోత్పాతానికి గురిచేసినట్టు రైతులు తమ తనిఖీల సందర్భంగా వెల్లడించినట్టు బృందం స్పష్టం చేసింది. అంతేగాక సామాజిక, ఆర్థిక, పర్యావరణం అంశాలతోపాటు ఆహారభద్రతపైనా సర్కారు చెప్పిన మాటల్లోనూ నిజం లేదన్న భావనను వ్యక్తం చేసింది.

ప్రపంచబ్యాంక్‌ రాజధానిలో ప్రాజెక్టుకు అందించే ఆర్థిక సాయం 93 శాతం ల్యాండ్‌ పూలింగ్‌కు సంబంధించిందేనంటూ.. ఈ ప్రాజెక్టు వల్ల సామాజిక, ఆర్థిక, పర్యావరణం అంశాలతోపాటు ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందన్న రైతులు, సామాజిక, పర్యావరణవేత్తల అభిప్రాయాలను తన నివేదికలో క్రోడీకరించింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో భూములు, జీవనోపాధి కోల్పోతున్న రైతులు, రైతుకూలీల నుంచి వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ముఖ్యంగా సామాజిక అంశాలు, జీవనోపాధి, ఆహార భద్రతపైన తీవ్ర ఆరోపణలున్నందున, వాటన్నింటిపైన పునర్విచారణ చేసిన తరువాతనే రాజధానిలో ప్రాజెక్టుకు రుణం మంజూరుపై నిర్ణయం తీసుకోవాలని ప్రపంచబ్యాంక్‌ తనిఖీ బృందం బ్యాంకు డైరెక్టర్లకు సలహా ఇచ్చింది.

రాజధానికోసం ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులతోపాటు జీవనోపాధి కోల్పోతున్న భూమిలేని రైతుకూలీలు, అలాగే పర్యావరణ, సామాజికవేత్తల ఫిర్యాదు మేరకు ప్రపంచబ్యాంక్‌ తనిఖీ బృందం ఆగస్టు 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటించడం తెలిసిందే. ఆ పర్యటనకు ముందు సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమై వివరాలు తీసుకుంది. ఆ వివరాల ప్రకారం పలు గ్రామాల్లోని రైతులతో సమావేశమై వారి అభిప్రాయాల్ని నేరుగా తెలుసుకుంది. పర్యటన సందర్భంగా రైతులనుంచి వ్యక్తమైన అభిప్రాయాలతోపాటు తనిఖీ సందర్భంగా తాము గమనించిన అంశాలతో నివేదికను ప్రపంచబ్యాంక్‌ బోర్డు డైరెక్టర్లకు సమర్పించింది.  

భూసమీకరణ స్వచ్ఛందమంటున్నా 
భూసమీకరణ స్కీము స్వచ్ఛందమని తొలినుంచీ సీఆర్‌డీఏ చెబుతోందని, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని నివేదికలో తనిఖీ బృందం పేర్కొంది. కొంతమంది భూసమీకరణకు స్వచ్ఛందంగా భూములిచ్చామని పేర్కొన్నారని, అయితే మరికొందరు తమ నుంచి బలవంతంగా, భయోత్పాతానికి గురిచేసి తీసుకున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపింది. భూసమీకరణలోకి రాకుంటే మీ కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అధికారులతోపాటు, గుర్తు తెలియనివారు బెదిరించారని రైతులు చెప్పినట్టు పేర్కొంది. అదే సమయంలో ల్యాండ్‌పూలింగ్‌లో స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది.

పూలింగ్‌ సమయంలో ప్రభుత్వం చెప్పినదానికి, వాస్తవంగా చేస్తున్నదానికి పొంతన లేదని ఆరోపించారని పేర్కొంది. పదేళ్ల కౌలుతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యబీమా, రుణమాఫీ చేస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు చేయలేదని తనిఖీలో వెల్లడైందని తెలిపింది. అలాగే ప్లాటు సైజు తగ్గించి ఇచ్చారని, మ్యాప్‌లో ప్లాటుకు, క్షేత్రస్థాయిలో ప్లాటుకు పొంతన లేదని పూలింగ్‌ రైతులు తెలిపినట్టు వివరించింది. సారవంతమైన భూముల్ని మెట్టభూములుగా చూపిస్తూ ప్లాటు విస్తీర్ణాన్ని తగ్గించారని, ఏడాదికివ్వాల్సిన కౌలు సొమ్ము ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారికి ప్లాట్ల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని పలువురు ఫిర్యాదు చేసినట్లు బృందం తెలిపింది. మరోవైపు భూసమీకరణకు భూములివ్వనివారి పొలాలకు విద్యుత్‌ కనెక్షన్లు కట్‌ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని, విద్యుత్‌ కనెక్షన్‌ లేకపోవడంతో పంటలు వేయలేక నష్టపోయామని  రైతులు స్పష్టం చేసినట్లు పేర్కొంది. 

కూలీల జీవనోపాధి దారుణం...
ఇక భూమి లేని కూలీల పరిస్థితి దారుణంగా ఉందని తనిఖీ బృందం గుర్తించింది. భూమిలేని కూలీలు రాజధాని ప్రాంతంలో 20,259 మంది ఉన్నారని, వారికి నెలకు రూ.2,500 చొప్పునే పింఛన్‌ ఇస్తున్నారని, ఇది ఏమాత్రం జీవనోపాధికి సరిపోవట్లేదని పలువురు పేర్కొన్నారని తెలిపింది. రాజధాని ప్రాంత పొలాల్లో ఇంతకుముందు కూలీచేస్తే రోజుకు రూ.800 చొప్పున సంపాదించేవారమని, నెలకు రూ.19,000 ఆదాయం వచ్చేదని, ఇప్పుడు పనుల్లేక నెలకు కేవలం రూ.8,476లే వస్తోందని, దీంతో జీవనం కష్టంగా మారిందని వారు తెలిపినట్టు వివరించింది. ఆహారభద్రతపై సీఆర్‌డీఏ ఇచ్చిన నివేదికకు, క్షేత్రస్థాయి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే 120 రకాల పంటలు పండుతున్నాయని బృందం పేర్కొంది.

రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రాజెక్టు కారణంగా శ్మశానాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు పోతున్నాయని, ఇది తమ మనోభావాలను దెబ్బతీస్తోందని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారని, ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అలాగే తనిఖీ సందర్భంగా రైతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులిస్తామన్నారని, కానీ కొందరు గొడవ సృష్టించి అరగంటలో ముగించేశారని, ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదని తన నివేదికలో వెల్లడించింది. మొత్తంగా ప్రపం చబ్యాంక్‌ విధానాలపై తీవ్ర ప్రతి కూల ప్రభావం చూపే అంశాలు న్నందున మరింత లోతుగా విచారణ చేశాకనే రుణం మం జూరుపై నిర్ణయం తీసుకోవాలని బృందం స్పష్టం చేసింది.

పూర్వాపరాలివీ.. 
రాజధాని ప్రాంతంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతోపాటు మరో ఏడు రహదారుల నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రపంచబ్యాంక్‌ నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే తొలుత రూ.ఏడువేల కోట్లు ప్రపంచబ్యాంక్‌ నుంచి రుణం పొందేందుకోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ మొత్తాన్ని కేంద్రం రూ.3,400 కోట్లకు కుదించింది. ఈ రుణమిచ్చేందుకు ప్రపంచబ్యాంక్‌ ఇంకా అంగీకారం తెలపలేదు. పర్యావరణ, సామాజిక ప్రభావ అంచనా, సామాజిక ఆర్థిక సర్వే నివేదికల రూపకల్పనలో ప్రస్తుత ప్రాజెక్టు ఉంది. అయితే తమ జీవితాల్ని నాశనం చేసి భూములు తీసుకున్నారని, ప్రపంచబ్యాంక్‌ విధానాల మేరకు సహాయ, పునరావాసం అమలు చేయట్లేదంటూ రాజధాని ప్రాంత రైతులు బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. గతేడాది చేసిన ఫిర్యాదులను తిరస్కరించిన ప్రపంచబ్యాంక్‌ తనిఖీ బృందం ఈ ఏడాది జూన్‌లో మాత్రం క్షేత్రస్థాయి తనిఖీలకు అంగీకరించింది. ఆ మేరకు ఆగస్టు నెలలో రాజధాని ప్రాంతంలో పరిశీలించింది.

తమ జీవనోపాధి దెబ్బ తిన్నదని రాజధాని ప్రాంత రైతు కూలీలు, కౌలు రైతులు చెప్పినట్లు పేర్కొన్న ప్రపంచ బ్యాంకు కమిటీ

ఆహార పంటలు పండించడం లేదని సీఆర్‌డీఏ చెప్పిందన్న కమిటీ 

ల్యాండ్‌ పూలింగ్‌ స్వచ్ఛందమని చెప్పలేమని నివేదికలో పేర్కొన్న భాగం  

ఆహార భద్రత, పర్యావరణ ప్రభావంపై రైతుల అభిప్రాయాలను క్రోడీకరించిన భాగం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top