
సాక్షి, విజయవాడ: ‘దిశ’ యాప్ సాయంతో మహిళను వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం విజయవాడలో జరిగింది. బస్సులో వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న మహిళ పట్ల తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తెల్లవారుజామున 4.21 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలో బాధితురాలి వద్దకు చేరుకున్నారు. అనంతరం వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని ప్రొఫెసర్‌గా గుర్తించారు. మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని దిశ ప్రత్యేకాధికారి దీపిక పాటిల్ పేర్కొన్నారు. (‘దిశ’ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్)