జిల్లాలో 42 ప్రభుత్వ మద్యం దుకాణాలు

Wine Shops Are Open In Visakhapatnam - Sakshi

పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు 

రెన్యువల్‌ చేసుకోని వాటి స్థానంలో భర్తీ

జాయింట్‌ కలెక్టర్‌ సారథ్యంలో నూతన పాలసీకి శ్రీకారం

సాక్షి, విశాఖపట్నం: దశల వారీ మద్యపాన నిషేదం దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే బెల్ట్‌ మద్యం దుకాణాలను దాదాపు నియంత్రించిన ప్రభుత్వం సిండికేట్‌ వ్యాపారానికి కూడా చెక్‌ పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను నడిపేందుకు కార్యాచరణ రూపొందించింది. సర్కారు ఆదేశాల మేరకు మరో పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 42 మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. క్రితం సారి వేలంలో హక్కులు పొంది గతేడాది లైసన్స్‌లు పునరుద్ధరించుకోని దుకాణాల స్థానంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో దుకాణానికి ఓ సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్‌ను నియమించనున్నారు. దీనికి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేసి అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా సిబ్బందిని భర్తీ చేయనున్నారు. వీరికి జీతభత్యాలు, ఇతరత్ర అంశాలను నోటిఫికేషన్‌ సమయంలో ప్రకటిస్తారు. ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ బాధ్యతలు జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు చూసుకుంటారు.

సిండికేట్‌కు చెక్‌
గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మద్యం ఏరులై పారిన సంగతి తెలిసిందే. లైసన్స్‌ మద్యం దుకాణాలకు ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంతో సిండికేట్‌ వ్యాపారం పెచ్చుమీరింది. దీంతో బెల్ట్‌ దుకాణాలు పుట్టగొడుగుల్లా ఎక్కడిక్కడే వెలిశాయి. ఆయా దుకాణాలకు నేరుగా లైసన్స్‌ షాపుల నుంచే మద్యం సరఫరా చేయడంతో మద్యం వ్యాపారం మూడు ఫుల్‌లు.. ఆరు క్వార్టర్లుగా సాగింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభించినా వాటి నిర్వహణ గాలికి వదిలేయడంతో కొద్దిరోజులకే దుకాణాలన్నీ మూతపడ్డాయి. దీంతో సిండికేట్‌ వ్యాపారులు మరింత విజృంభించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నూతన మద్యం పాలసీతో ఈ సిండికేట్‌ వ్యాపారానికి పూర్తిగా చరమగీతం పాడినట్లే. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపడితే బెల్ట్‌ దుకాణాల మనుగడ ఉండదు. ధరల నియంత్రణ ఉంటుంది. కల్తీ మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉండవు. 

నిరుద్యోగులకు మందికి ఉపాధి
మరోవైపు నూతన మద్యం పాలసీ వల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తం 42 దుకాణాలకు గాను ఒక్కో దుకాణానికి ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌ మెన్‌ను నియమిస్తారు. తద్వారా జిల్లాలో 126 మందికి ఉపాధి లభిస్తుంది. సిబ్బంది జీత భత్యాలు, దుకాణాల సమయాలు, ఇతర నియమ నిబంధనలు రెండు మూడు రోజుల్లో జేసీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

పది రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది.. 
నూతన మద్యం దుకాణాలు ప్రారంభించడానికి మాకు సమాచారం అందింది. దీనిపై కమిషనర్‌తో సమీక్ష కూడా జరిగింది. మరో పదిరోజుల్లో సిబ్బంది నియామకాలు, దుకాణాల లభ్యతను చూసుకుని అమ్మకాలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన తరువాత మరిన్ని విషయాలపై స్పష్టత వస్తుంది.  –శ్రీనివాసరావు, డీసీ, ఎక్సైజ్‌శాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top