
చలిగాలుల విజృంభణ
ఏజెన్సీలో మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలిగాలులు విజృంభించాయి.
పాడేరు: ఏజెన్సీలో మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలిగాలులు విజృంభించాయి. బుధవారం పాడేరుకు సమీపంలోని మినుములూరు కాఫీబోర్డు వద్ద 19 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే గురువారం నాటికి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మినుములూరు కాఫీ బోర్డులో 14 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడివద్ద 11 డిగ్రీలు, లంబసింగిలో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి.
ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. అర్ధరాత్రి నుంచే మంచు తీవ్రత కనిపిస్తోంది. పొగమంచు ఉదయం 10 గంటల వరకు ఉంటుండటంతో మన్యంలో సూర్యోదయం కూడా ఆలస్యమవుతోంది. గురువారం పాడేరు పట్టణంలో ఉదయం 10.30 గంటలకు మంచు తెరలు తొలగి సూర్యకిరణాలు తాకాయి. ఇదే పరిస్థితి చింతపల్లి ప్రాంతంలో కూడా నెలకొంది. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు చన్నీళ్ల స్నానం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.