breaking news
The minimum temperature
-
వింత కాలం... జర భద్రం
నగరంలో విచిత్ర వాతావరణం పెరుగుతున్న సీజనల్ వ్యాధులు కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మరో 48 గంటల్లో చలి తీవ్రం సాయంత్రం 5 గంటలకే చల్లబడుతున్న వాతావరణం... రాత్రి ఏడు నుంచి తెల్లవారి 8 గంటల వరకూ వణికించే చలి. భయపెడుతున్న చలిగాలులు. మరోవైపు ఉదయం 10 గంటల నుంచే విజృంభిస్తున్న సూరీడు... మధ్యాహ్నానికి హడలెత్తిస్తున్న ఎండలు. వేసవిని తలపించేలా వేడి మి. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో కనిపిస్తున్న ఈ వింతవాతావరణ పరిస్థితులు ప్రజలను అనారోగ్యం బారినపడేలా చేస్తున్నాయి. వివిధ వ్యాధులు విజృంభించేందుకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ఆహారంతో పాటు వ్యాయామం... చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సిటీబ్యూరో: తెల్లవారు ఝామున.. రాత్రి వేళ చలి పులి.. మధ్యాహ్నం వేసవిని తలపిస్తున్న వేడిమి... నగరంలో ఈ విపరీత వాతావరణ పరిస్థితులతో చిన్నారులు, వృద్ధులు, రోగులు అవస్థలు పడుతున్నారు. స్వైన్‌ఫ్లూ, జ్వరం, వైరల్‌ఫీవర్స్, జలుబు వంటి సీజనల్ వ్యాధులతో జనం సతమతమవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుండడంతో పలువురు అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ సీజన్లో ఉదయం వేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 12 లేదా 13 డిగ్రీల మేర నమోదవడం పరిపాటే. కానీ శుక్రవారం నగరంలో 16.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి. అంటే సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నమాట. ఇక పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 32.9 డిగ్రీలు నమోదైంది. ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల కారణంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ డెరైక్టర్ వైకేరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరో 48 గంటల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల మేర తగ్గుముఖం పట్టనున్నాయని... చలి క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని వివరించారు. రుతు పవనాల ఉపసంహరణ, ఆకాశం నిర్మలంగా ఉండి మేఘాల ఉద్ధృతి తీవ్రంగా లేకపోవడం వంటి కారణాలవల్లే ఎండ వేడిమి పెరుగుతోందని విశ్లేషించారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి సాధ్యమైనంత వరకు పసిపిల్లలను బయట తిప్పకూడదు. బుగ్గలు కందిపోకుండా రాత్రి పడుకునే ముందు పాండ్స్ రాయాలి కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తువులను ఎంపిక చేసుకోవాలి పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారి తీసే ప్రమాదం ఉంది. పిల్లలకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. -డాక్టర్ నరహరి, నిలోఫర్ ఆస్పత్రి వృద్ధులు జాగ్రత్త వృద్ధులు చలినే కాదు... ఎండను కూడా తట్టుకోలేరు. ఇంట్లో చిన్న మంట పెట్టి, గదిలో వెచ్చదనాన్ని కలిగించాలి. వేడి నీళ్లతో స్నానం చేయించాలి. చలి కోటుతో పాటు కాళ్లకు, చేతులకు గ్లౌజులు, సాక్స్‌లు ధరించాలి. చలికాలంలో రకరకాల వైరస్లు వాతావరణంలో సంచరిస్తుంటాయి. వృద్ధులు ఈ వైరస్‌లతో అప్రమత్తంగా ఉండాలి. చలికి గుండెపోటుతో పాటు జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 8గంటల తర్వాతే వీరు బయటికి రావాలి. -డాక్టర్ నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి ఫ్లూ పొంచి ఉంది హైరిస్క్ బాధితులైన గర్భిణులు, బాలింతలు ఈ వాతావరణ పరిస్థితిని, చలిని తట్టుకోలేరు. వీరు సాధ్యమైనంత వరకు జన సందోహం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో తిరగకపోవడం ఉత్తమం. ఇతరులతో పోలిస్తే గర్భిణులు, బాలింతలు సులభంగా ఫ్లూ భారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇన్హేలర్ వాడుతున్న గర్భిణులు మందు డోస్‌ను కొంత పెంచాలి. చలి తీవ్రత వల్ల బాలింతలకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి. -డాక్టర్ శ్రీహర్ష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి -
చలిగాలుల విజృంభణ
పాడేరు: ఏజెన్సీలో మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలిగాలులు విజృంభించాయి. బుధవారం పాడేరుకు సమీపంలోని మినుములూరు కాఫీబోర్డు వద్ద 19 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే గురువారం నాటికి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మినుములూరు కాఫీ బోర్డులో 14 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడివద్ద 11 డిగ్రీలు, లంబసింగిలో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. అర్ధరాత్రి నుంచే మంచు తీవ్రత కనిపిస్తోంది. పొగమంచు ఉదయం 10 గంటల వరకు ఉంటుండటంతో మన్యంలో సూర్యోదయం కూడా ఆలస్యమవుతోంది. గురువారం పాడేరు పట్టణంలో ఉదయం 10.30 గంటలకు మంచు తెరలు తొలగి సూర్యకిరణాలు తాకాయి. ఇదే పరిస్థితి చింతపల్లి ప్రాంతంలో కూడా నెలకొంది. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు చన్నీళ్ల స్నానం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.