మూడు ముళ్లు.. ఏడడుగులు వేశారు.. కడదాకా కలిసుంటామని వివాహబంధంతో ఒక్కటయ్యారు.
జైపూర్, న్యూస్‌లైన్ : మూడు ముళ్లు.. ఏడడుగులు వేశారు.. కడదాకా కలిసుంటామని వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహ కట్టుబాట్లను నిజం చేస్తూ వృద్ధదంపతులు ఇద్దరూ గంట వ్యవధిలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. నీవెంటే నేను అంటూ పరలోకాలకు వెళ్లిపోయారు.. వివరాలిలా ఉన్నాయి. జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మాల్కారి రామయ్య(75), పోసక్క(65) దంపతులు గంట తేడాతో మృత్యువాత పడ్డారు. రామయ్య సింగరేణి కార్మికుడిగా పనిచేసి పన్నెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. పోసక్క మూడేళ్ల క్రితం పక్షవాతంతో మంచం పట్టింది.
వీరికి ముగ్గురు కుమారులు. కుమారులకు పెళ్లై వేరుగా ఉంటుండగా వృద్ధదంపతులు మాత్రం ఒకే ఇంట్లో ఉంటున్నారు. పోసక్క పక్షవాతానికి గురైనా రామయ్య ఆమెకు సేవలు చేస్తున్నాడు. తోడునీడగా ఉంటున్నారు. అయితే మంగళవారం రాత్రి పోసక్క అస్వస్తతకు గురైంది. ఒంటిగంటలకు మృతిచెందింది. అప్పటికే విరోచనాలతో రామయ్య బాధపడుతున్నాడు. విషయం తెలియడంతో గంటకే మృత్యుఒడికి చేరుకున్నాడు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుమకున్నాయి. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.