
‘చంద్రబాబు ఎందుకు ముఖం చాటేశారు’
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ముఖం చాటేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత ప్రశ్నించారు.
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ముఖం చాటేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రజల మనోభావాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్నింటినీ కేంద్రం తుంగలో తొక్కుతోందంటూ ఇటీవల ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ రాశారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రానికి వచ్చినా చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి కూడా వ్యక్తిగతంగా కలసి వివరణ ఇవ్వకపోవడంలో ఉన్న మతలబు ఏమిటో వివరణ ఇవ్వాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
విభజనకు సంబంధించిన కీలక బిల్లులు రాష్ట్రపతి ద్వారానే వెళ్తాయనే విషయం తెలిసి కూడా చంద్రబాబు ఎందుకు మిన్నకుండిపోయారన్నారు. ఈ మేరకు సుచరిత ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదంటూ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు, ఆదివారం సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల వెంట ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
రాష్ట్ర సమైక్యతపై చంద్రబాబు అభిప్రాయాన్ని చెప్పాలని ప్రణబ్ అడిగితే తన భండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్రపతిని కలవకుండా ఆయన ముఖం చాటేశారని సుచరిత ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా రెండు నాల్కల ధోరణి విడనాడి, విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే ప్రజల చేతిలో ఆ పార్టీకి, ప్రజాప్రతినిధులకు గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు.