ఎడారిలా..

ఎడారిలా..


తడి ఆరిన రక్షిత  నీటి పథకాలు

పడకేసిన మంచినీటి పథకాలు

వెంటాడుతున్న నిధుల కొరత

కనీస మరమ్మతులకు నోచుకోని వైనం

ఎండిపోతున్న చెరువులు, బావులు

పాలకుల వైఫల్యంపై గ్రామస్తుల ధ్వజం


 

నిధుల లేమి.. అధికారుల నిర్లక్ష్యం.. వెరసి గ్రామీణులకు గుక్కెడు నీరందని దౌర్భాగ్య పరిస్థితి జిల్లాలో నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల సామూహిక రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) పడకేశాయి. ఇందులోని మోటార్లు మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడే లేడు. తాగునీటిని సరఫరా చేసే పైప్‌లైన్లకు లీకేజీలు ఏర్పడినా కనీస మరమ్మతులు చేయలేని పరిస్థితి. ఫలితంగా వేసవికి ముందే జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి.

 

విజయవాడ : జిల్లాలో 374 తాగునీటి చెరువులు ఉన్నాయి. వర్షాభావం, కాలువలకు నీటి విడుదలలో జాప్యం కారణంగా అడుగంటాయి.  సామూహిక రక్షిత మంచినీటి పథకాల ద్వారా బిందెడు నీరు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందని దుస్థితి నెలకొంది. ఈ చెరువుల ఆధారంగానే రక్షిత నీటి పథకాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ఉప్పునీరే దిక్కవుతోంది. ఈ నీరు తాగడం వల్ల రకరకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి.



నిధుల కొరత

గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు జిల్లా పరిషత్‌కు  జమ అయ్యేవి. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ అవుతున్నాయి.  పలువురు సర్పంచులు సామూహిక రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ఆలోచిస్తుండడంతో గ్రామీణ నీటి సరఫరా శాఖను నిధుల కొరత వేధిస్తోంది. దీనికితోడు జెడ్పీ పాలకవర్గ సభ్యులు తాగునీటి సరఫరాలో నిధులకు సంబంధించి పొదుపును పాటిస్తుండడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ బిల్లుల భారం, మోటార్ల కొనుగోలు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని వివిధ సామూహిక రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. జిల్లాలోని 717 గ్రామాలకు సీపీడబ్ల్యు పథకాల ద్వారా తాగునీరు అందించేందుకు ఏడాదికి రూ. 15.84 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా తాగునీటి కొరత తీరడం లేదు.



కంచికచర్ల మండలంలోని 42 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు కృష్ణానదిలో బత్తినపాడు తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. నదిలో నీరు లేకపోవడంతో నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది.



గన్నవరం నియోజకవర్గంలో ఏలూరు కాలువపై ఆధారపడి నడుస్తున్న రక్షిత నీటి పథకాల్లో అల్లాపురం, తెంపల్లి, బాపులపాడు, పెరికీడు ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయి. సాధారణంగా ఏలూరు కాలువ నుంచి నీటిని మోటార్ల ద్వారా ఈ ప్రాజెక్టులకు తరలించాల్సి ఉంది. అనంతరం ప్రాజెక్టులోని నీటిని ఫిల్టర్‌బెడ్‌ల ద్వారా శుద్ధిచేసి గ్రామాలకు సరఫరా చేస్తుంటారు.  ఏడాది కాలంలో ఏలూరు కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకపోవడంతో ఈ ప్రాజెక్టులకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల సుమారు 30 గ్రామాలకు నీటిని సరఫరా చేసే అల్లాపురం, తెంపల్లి ప్రాజెక్టులు నీరు లేక పూర్తిగా ఎండిపోయాయి. బాపులపాడు ప్రాజెక్టు నిర్మించి ఆరేళ్లయినా మరమ్మతుల కారణంగా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. పెరికీడు ప్రాజెక్టుకు నీటిని లిప్ట్ చేసే పైపులైన్లు రెండేళ్ల కిందట రోడ్డు విస్తరణలో పగిలిపోవడంతో మూలనపడింది.  



పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరులో 49 రక్షిత మంచినీటి పథకాలు, 17 డెరైక్ట్ పంపింగ్ స్కీములు ఉన్నాయి. 1.85 లక్షల జనాభాకు తాగునీటి అవసరాలు తీర్చటానికి కొత్తగా నాలుగు ట్యాంకులకు శంకుస్థాపనలు చేశారు. పనులు ప్రారంభానికి నోచలేదు.  



అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 45 రక్షిత మంచినీటి పథకాలుండగా వీటిలో ఆరు పథకాలు ఆర్‌డబ్ల్యుఎస్ నిర్వహణలో ఉన్నాయి. కోడూరు, నాగాయలంక మండలాల్లోని పది గ్రామ పంచాయితీలకు తాగునీరు అందించే కమ్మనమోల రక్షిత మంచినీటి చెరువు పూర్తిగా అడుగంటింది. ఇక్కడ రెండురోజులకొకసారి ఒకపూట మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగాయలంక మండలంలో ఎదురుమొండి రక్షితనీటి పథకం పూర్తిగా ఎండిపోయింది.  



జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లిలో ఏర్పాటు చేసిన తాగునీటి పెలైట్ పథకం నిరుపయోగంగా మారింది. అనుమంచిపల్లి, తక్కెళ్లపాడు, గరికపాడు, రామచంద్రునిపేట గ్రామాలకు గత ఏడాది గ్రామీణ నీటి సరఫరా శాఖ రూ.2.10 కోట్ల నిధులతో పెలైట్ ప్రాజెక్టు ద్వారా పాలేటిలో బోరు వేసి నీరు అందించేందుకు చర్యలు చేపట్టింది.



మైలవరం మండలంలో కృష్ణా జలాల పంపిణీకి పైలట్ ప్రాజెక్టు పనులు పూర్తయినా శివారు గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా కావడంలేదు. ఆయా గ్రామాల ప్రజలు బోరునీటినే తాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు, కేతనకొండ, దాములూరు, చిలుకూరు, కాచవరం, కొటికలపూడి గ్రామాల్లో  తాగునీటి సమస్య వుంది.  ఈ గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ. 450కోట్లతో పైలట్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టినా పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.



చాట్రాయి మండలంలోని చిన్నంపేట, కోటపాడు, తుమ్మగూడెం, చనుబండ, చీపురుగూడెం, పోతనపల్లిలలో  గ్రామాలలో  బోర్లు ఎండిపోవడం వల్ల నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.    



పామర్రు మండలం ఐనంపూడిలో తాగునీటికి వినియోగించే బావిలో నీరు అడుగంటడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఎలకుర్రులో చెరువులు ఎండిపోవడంతో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అధికారులు అందజేస్తున్నారు. నెమ్మలూరు తాగునీటి చెరువులో నీరు అడుగంటడంతో కొద్దిపాటిగా  ఉన్న నీటినే తాగునీరుగా వాడుకుంటున్నారు. జుఝవరంలో ఫిల్టర్ బెడ్‌లు లేకపోవడంతో చెరువు నుంచినేరుగా కలుషిత నీరే ఉపయోగించుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top