
ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా ఉద్యమ కార్యచరణ: అశోక్ బాబు
సీమాంధ్ర ఉద్యమానికి లక్ష గొంతుకలు తోడవడంతో కర్నూలు పట్టణం సమైక్య గర్జనతో మార్మోగింది.
కర్నూలు: సీమాంధ్ర ఉద్యమానికి లక్ష గొంతుకలు తోడవడంతో కర్నూలు పట్టణం సమైక్య గర్జనతో మార్మోగింది. గత రెండు నెలల నుంచి సమైక్య నినాదంతో గర్జించిన సీమాంధ్ర ప్రజలు రాష్ట్రాన్ని యధావిధిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ సభలో పలువురు మాట్లాడారు. ఈ సభకు రాజకీయ నాయకులు రాకపోయినా, ప్రజలే నాయకులుగా ఉండి సభను విజయవంతం చేశారు. ఈ సభలో చివరిగా ప్రసంగించిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్ లో సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి దోహద పడితే.. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులకు భాగస్వామ్యం లేదనడం భావ్యం కాదని అశోక్ బాబు సూచించారు. సమైక్య ఉద్యమాన్ని చులకనగా చేసి మాట్లాడటం సరికాదన్నారు.
రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఇస్తామంటే అడ్డుకుంటామన్నారు. ఒకవేళ పార్లమెంట్ లో తెలంగాణ విభజన బిల్లు పెడితే మిలినియం మార్చ్ చేస్తామని అశోక్ బాబు హెచ్చరించారు. ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా తమ భవిష్య ఉద్యమ కార్యచరణ ఉంటుందని ఆయన తెలిపారు. యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు ఇంత ఉద్యమం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ఆ ఇబ్బందిని దిగుమింగుకుని ఉద్యమంలో పాల్గొంటున్న సంగతిని తెలంగాణ నేతలు గుర్తించాలన్నారు.
కేసీఆర్ చాలాసార్లు సీమాంధ్ర సంస్కృతిని అవమానించిన విషయాన్ని అశోక్ బాబు లేవనెత్తారు. సీమాంధ్ర బస్సులపై రాళ్లను వేయించడం తెలంగాణ సంస్కృతా?అని ప్రశ్నించారు. ఈ ప్రజా ఉద్యమంలో సంస్కృతిల పేరుతో విమర్శించుకోవడం భావ్యం కాదన్నారు. ఎవరకు ఉండే సంస్కృతి వారికే ఉంటుదని తెలిపారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టే.. ఆనాడు దొరల పాలన, ఈనాడు టీఆర్ఎస్ హవా కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ కు తమదే అంటున్నటీఆర్ఎస్ పార్టీ.. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేదని సూటిగా ప్రశ్నించారు.