భారత నావికాదళానికి చెందిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్ శనివారం కాకినాడ తీరంలో లంగరేసింది.
కాకినాడ సిటీ: భారత నావికాదళానికి చెందిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్ శనివారం కాకినాడ తీరంలో లంగరేసింది. ఈ నెల 4 నుంచి 8 వరకూ విశాఖ తీరంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న విరాట్ ముంబై తిరిగి వెళుతోంది. ఆ క్రమంలో నౌకను కాకినాడ డీప్ వాటర్‌పోర్టుకు కొద్ది దూరంలో నిలిపారు. అయితే నౌకను సందర్శించే అవకాశాన్ని కేవలం పోర్టు, నేవీ, ఇతర అధికారులకే పరిమితం చేసి, బయటి వారిని అనుమతించ లేదు.
57 ఏళ్ళపాటు అటు బ్రిటన్, ఇటు భారత నావికాదళాల్లో సేవలందించి ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన యుద్ధనౌకగా విరాట్ గుర్తింపు పొందింది. 1959 నుంచి సుమారు 27 ఏళ్ళు బ్రిటిష్ నేవీలో సేవలందించిన ఈ నౌకను 1986లో భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొద్ది మరమ్మతులతో 1987నుంచి ఈ నౌక ఐఎన్‌ఎస్ విరాట్ పేరుతో భారత నావికాదళంలో అతిపెద్ద, ఏకైక విమానవాహక యుద్ధనౌకగా నడుస్తోంది. అయితే విరాట్ భారత నావికాదళ సేవల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో త్వరలో విశాఖ తీరంలో షిప్ మ్యూజియంగా ఏర్పాటుచేయనున్నారు.