మళ్లీ నిరాశే! | Vizianagaram district'srailway budget always disappointment | Sakshi
Sakshi News home page

మళ్లీ నిరాశే!

Feb 13 2014 1:44 AM | Updated on Sep 2 2017 3:38 AM

రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఎప్పటిలాగే నిరాశే ఎదురైంది. ఏడాది పాటు నిరీక్షించిన జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట చెల్లుబాటు కాలేదు.

విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఎప్పటిలాగే నిరాశే ఎదురైంది. ఏడాది పాటు నిరీక్షించిన జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట చెల్లుబాటు కాలేదు.  కేంద్రంలో తనకున్న పలుకుబడితో జిల్లాకు న్యాయం చేస్తానని చెప్పిన ఎంపీ ఏమీ తీసుకురాలేకపోయారు. ఆమె విజ్ఞప్తిని రైల్వేమంత్రి లెక్క చేయలేదని తెలుస్తోంది. మూడు రాష్ట్రాలకు కలిపి కొత్తగా వేస్తున్న రైళ్ల వెనుక తన ఘనత ఉందని చివరికి సమర్థించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వేకి సంబంధించి విశాఖ- గుణుపూర్ పాసింజర్ రైలు తప్పితే  ఇంకేదీ మనకందలేదు.   రైల్వే బడ్జెట్ ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపలేదు సరికదా గత బడ్జెట్‌లో చేర్చిన అంశాలకు కూడా నిధులు కేటాయించలేదు. ఇదంతా చూస్తుంటే గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు మరో రెండు మూడే ళ్లయినా అమలయ్యే పరిస్థితి కన్పించడం లేదు. 
 
 విజయనగరం-రాయపూర్ లైన్ విద్యుద్దీకరణ, విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు ప్రత్యేక రైల్వే లైన్, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, విజయనగరం రైల్వే స్టేషన్‌లో అవుట్ పేషెంట్ విభాగం, వ్యాధి నిర్ధారణ కేంద్రం తదితరాలన్నీ చాలా కాలంగా ప్రతి రైల్వే బడ్జెట్‌లో పేర్కొంటున్నారు. ఈసారి ఆ ప్రస్తావన కూడా లేకుండా చేశారు. దీన్నిబట్టి గత కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏళ్ల నాటి డిమాండ్‌లైన పలాస-విశాఖ రైలు,  సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న కోరిక,  సుమారు రూ.కోటి 55 లక్షలతో విజయనగరంలో నిర్మించిన మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని తీసుకొస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధి కూడా ఏళ్ల నాటి  డిమాండ్ జాబితాలో చేరిపోయింది. ఎంపీ ఝాన్సీలక్ష్మీ ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా ఒక డిమాండ్‌గానే మిగిలిపోయింది.
 
 రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని 5వ ప్లాట్‌ఫామ్ నుంచి చివరి ప్లాట్‌ఫామ్ వరకూ నిర్మించేందుకు చేసిన ప్రతిపాదనలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. వాటికి సంబంధించి పిల్లర్లు వేసి పనులు అర్ధాంతరంగా నిలుపుదల చేశారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్‌లో చివరి వరకూ షెల్టర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఆ పనులు కూడా నెరవేరలేదు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విశాఖ-కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కేవలం వారంలో రెండురోజులు మాత్రమే నడుపుతున్నారు. వాస్తవానికి ఐదురోజులు నడపాల్సి ఉంది. వి.టి.అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేట్ ఏర్పాటుచేయాలన్న వినతులు వినతులుగానే మిగిలిపోయాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement