‘అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు’ | Sakshi
Sakshi News home page

‘సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తాం’

Published Tue, Aug 27 2019 5:17 PM

Village Secretary Exam Will Be Conducted Transparently Minister Peddireddy Ramachandra Reddy Says - Sakshi

సాక్షి, అమరావతి : సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు జరిగే సచివాలయ పరీక్షల కోసం అన్ని ఏర్పాటు పూర్తి చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  అన్నారు. పరీక్షల నిర్వహణ కోసం  5,114 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు దళారులను నమ్మొద్దని  సూచించారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఓఎమ్‌ఆర్‌ షీట్లను జిల్లాలకు తరలిస్తున్నామని తెలిపారు. పరీక్షల కోసం ప్రతి జిల్లాలో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు.

‘అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయబోతున్నాం. సచివాలయ పరీక్షల నిర్వాహణ ప్రక్రియ సీఎంవో పర్యవేక్షిస్తోంది. సమాధాన పత్రాలను నాగార్జున యూనివర్సీటీకి తరలించి స్కానింగ్‌ చేస్తారు.  పరీక్షల కోసం హాల్‌ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థుల కోసం ఆర్టీసీ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. దివ్యాంగులకు అదనపు సమయం కేటాయిస్తాం. ఈ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం.  చాలా మంది దళారులు రూ.5 లక్షలు ఇస్తే ప్రశ్నాపత్రం ఇస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. వారిని నమ్మి అభ్యర్థులు మోస పోవద్దు. దళారులపై నిఘా పెట్టాం.. ఎక్కడ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని మంత్రి వివరించారు.

సెప్టెంబర్‌ 5నుంచి ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. కొత్తపాలసీని తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీఎండీసీ ద్వారానే ఇసుక పాలసీ అమలు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement