‘సదావర్తి’పై విజిలెన్స్‌ విచారణ

Vigilance Inquiry On Sadavarti Lands Issue - Sakshi

3 నెలల్లో సభ ముందుకు నివేదిక

తప్పు చేసిన వారిని ఉపేక్షించబోం

మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ వ్యాఖ్య స్వాగతిస్తున్నామన్న చంద్రబాబు

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో సదావర్తి భూముల భూబాగోతంపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఒక సీనియర్‌ అధికారితో విచారణ జరిపించి ఈ బండారం బట్టబయలు చేస్తామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. విచారణ నివేదికను 3 నెలల్లో సభలో ఉంచుతామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. అంతకుముందు.. ఆర్కే మాట్లాడుతూ, సదావర్తి భూముల వేలం వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలను వివరించారు.

పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం 1885లో రాజా వెంకటాద్రినాయుడు చెన్నైలో 471 ఎకరాల భూమిని కేటాయించారని, అప్పటి నుంచి ఆదాయం వస్తోందన్నారు. కాలక్రమంలో చెన్నైలోని ఆ భూమి అన్యాక్రాంతమై చివరికి 83.11 ఎకరాలు మాత్రమే మిగిలిందన్నారు. ఈ మొత్తం భూమిని తన అనుయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నిందని వివరించారు. ఎవరికీ తెలీకుండా ఉండేందుకు చెన్నైలోని రెండు పత్రికలలో కనీకనబడనట్టుగా ఈ–టెండర్ల ప్రకటన ఇస్తే అందులో చంద్రబాబు మనుషులు వెళ్లి వేలంలో పాల్గొన్నారన్నారు. దీనిపై తాను కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. అలాగే, 83.11 ఎకరాల సదావర్తి భూములను రూ.22 కోట్లకు కట్టబెట్టడాన్ని తాము కోర్టులో సవాల్‌ చేస్తే మరో 5 కోట్లు ఎక్కువ ఇచ్చి తమనే తీసుకోమన్నారన్నారు. కాగా, తాను రూ.27.5 కోట్లు కడితే తనపై ఐటీ దాడులు చేయిస్తామని చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ బెదిరించారన్నారు. ఈ నేపథ్యంలో సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇందుకు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి అంగీకరించారు.

ఆ భూమిని ఎలా వేలం వేయాలనుకున్నారు?
చంద్రబాబు మాట్లాడుతూ.. విచారణను స్వాగతిస్తున్నామంటూనే ఆర్కే తదితరుల తీరువల్ల ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం పోయిందన్నారు. ఆ భూములకు టైటిల్‌ డీడ్, పట్టాలులేవని, తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ భూమి తమదే అంటున్నదని చంద్రబాబు చెప్పినప్పుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి జోక్యం చేసుకుని అటువంటి భూమిని (టైటిల్‌ డీడ్స్, పట్టాలు లేని) వేలంవేసి ఒక ప్రభుత్వం మోసం చేయవచ్చా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ నడిచింది. డాక్టర్‌ వైఎస్సార్‌కు ఇచ్చిన హామీవల్లే కియా మోటార్స్‌ వచ్చిందని బుగ్గన చెప్పిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దీన్ని బుగ్గన దీటుగా తిప్పికొట్టారు. కాగా, సదావర్తి సత్రం భూములపై అసెంబ్లీలో చర్చ జరిగిన తీరును చూస్తే ప్రభుత్వం ఆక్రమణలో ఉన్న ఆలయాల భూములను కాపాడుతుందన్న విశ్వాసం పెరుగుతోందని ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top