కేసుల పరిష్కారం కోసం జైలు, కోర్టును అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ సేవలు రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభమయ్యాయి.
మదనపల్లె రూరల్ (చిత్తూరు జిల్లా) : కేసుల పరిష్కారం కోసం జైలు, కోర్టును అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ సేవలు రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని మెజిస్ట్రేట్ కోర్టులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అప్జల్ పుర్‌కర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మదనపల్లె సబ్‌జైలులో శుక్రవారం వాయిదాకు సిద్ధం చేసిన ఖైదీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి సలహాలు, సూచనలు అందజేశారు. ఇకపై కోర్టుకు ఏ కారణాల వల్లనైనా హాజరు కాలేని ఖైదీలతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్ధారిత సమయంలో మాట్లాడాతారని తెలిపారు. అవసరమైతే కేసులు పరిష్కరించడం, కొట్టి వేయడం, వాయిదాలు వేయడం కూడా చేస్తారని తెలిపారు. ఖైదీలు తమ సమస్యలను నిర్భయంగా న్యాయమూర్తులకు విన్నవించుకోవాలని సూచించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో జస్టిస్ అఫ్జల్ పుర్‌కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 37 చోట్ల త్వరలో వీడియో కాన్ఫరెన్స్ సేవలు ప్రారంభించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. న్యాయస్థానాలను జైళ్లకు అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని, ఖైదీలకు రక్షణ కల్పించి త్వరితగతిన కేసులు పరిష్కరించేందుకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.ఆనంద్, ఉన్నత న్యాయస్థానం సెంట్రల్ ప్రాజెక్టు సమన్వయకర్త కె.నరసింహాచారి, మదనపల్లె మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ , అదనపు జిల్లా జడ్జి ఎస్‌ఎస్‌ఎస్ జయరాజ్ ఆయనకు స్వాగతం పలికారు. విలేకరుల సమావేశం అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. చివరగా బార్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. న్యాయమూర్తులు ప్రదీప్‌కుమార్, శరత్‌బాబు, మోహన్‌రావు, భాస్కర్‌రావు, కవిత, న్యాయవాదులు మాలతి, ఆవుల మోహన్‌రెడ్డి, అమరనాథరెడ్డి పాల్గొన్నారు.