వర్ష'మా'.. క్షమించు..! 

Unidentified Persons Left 87 Years Of Old Woman On Road - Sakshi

మంటగలుస్తున్న మానవ సంబంధాలు 

ఓ వృద్ధురాలిని వర్షంలో రోడ్డపై పడేసినవైనం 

ఆదరించిన హాస్టల్‌ విద్యార్థినులు 

సాక్షి, ఒంగోలు: మారుతున్న నవీన ప్రపంచంలో రోజురోజుకూ మనావ సంబంధాలు మంటగలుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.  స్థానిక భాగ్యనగర్‌ 4వ లైనులో ఉన్న 11వ అడ్డరోడ్డులో ఏసీబీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఎనభైఏళ్ల వృద్ధురాలిని ఓ ఆటోవాలా రోడ్డుపక్కన నెట్టివేసి అదృశ్యమయ్యారు. ఈ హృదయవిదారక సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సమయంలో జోరున వర్షం కురుస్తుండడంతో వెంటనే ఎవరూ గుర్తించలేకపోయారు. 

ఔదార్యం చూపి.. 
ఈ రోడ్డుకు సమీపంలోనే దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీ, సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం ఉంది. ఈ నేపథ్యంలో వర్షం తగ్గిన తరువాత హాస్టల్‌ వార్డెన్‌ సి.హెచ్‌.సరితాదేవి ఈ విషయాన్ని గమనించింది. వెంటనే హాస్టల్‌ విద్యార్థినులు రత్నదీపిక, భారతితో కలిసి వృద్ధురాలి వద్దకు వచ్చి ఆమె దయనీయ పరిస్థితికి చలించిపోయారు. ఒక నైటీని ఆమెకు వేశారు. అయినా ఆమె చలికి తట్టుకోలేకపోవడంతో ఒక చలికోటును కప్పారు. అప్పటికీ ఆమె గడగడలాడిపోతుండడంతో దుప్పటి తీసుకువచ్చి కప్పారు. 80 ఏళ్ల వయస్సులో ఆమెను ఎలా నిర్దయగా వదిలేశారంటూ ఆవేదన చెంది.. సామాజిక కార్యకర్త, పారాలీగల్‌ వలంటీర్, హెల్ప్‌ సంస్థ ప్రతినిధి బి.వి సాగర్‌ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. దీంతో అతను వెంటనే అక్కడకు వెళ్లి విచారించాగా.. ఏదో మూట పడేస్తున్నారనుకున్నామని,  ముసలామెని గుర్తించలేకపోయామంటూ ఓ పశువుల కాపరి తెలిపాడు.

ముందుగా విద్యార్థినుల సాయంతో వృద్ధురాలికి అల్పాహారం తినిపించి అక్కడ నుంచి పలు వృద్ధాశ్రమాల్లో చేర్పించేందుకు యత్నించగా తన పని తాను చేసుకోలేదంటూ ఆమెను చేర్చుకొనేందుకు నిర్వాహకులు వెనుకాడారు.  చివరకు కరణం బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న కసుకుర్తి కోటమ్మ మాత్రం ఆమెను అక్కున చేర్చుకునేందుకు ముందుకు వచ్చింది. వృద్ధురాలి వివరాలను రాబట్టేందుకు చేసిన యత్నం ఫలించలేదు. మగ పిల్లలు ఎంతమంది అని ప్రశ్నిస్తే ఇద్దరు అని, ఆడపిల్లలు ఎంతమంది అంటే ఒక్కరు అంటూ వేళ్లు చూపింది. రాత్రికి కోలుకున్నా మాట్లాడలేకపోతోంది. జోరువానలో ఆమెను నిర్దయగా కుటుంబ సభ్యులు ఆటోవాలా సాయంతో గెంటేశారా లేక ఆటో ఎక్కిన ఆమెను ఆటోవాలా దారి మళ్లించి ఆమె వద్ద ఉన్న వస్తువులు కాజేసి నిర్మానుష్యంగా ఉన్న రహదారిలో వదిలేసి పారిపోయాడా అనేది తెలియాల్సి ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top