రమణ దీక్షితులుకు నోటీసులు

TTD issued Notices to the Ramana Deekshithulu - Sakshi

చేసిన ఆరోపణలపై వివరాలివ్వాలని టీటీడీ హుకుం 

నోటీసును ఇంటి బయట గోడకు అంటించి వెళ్లిన సిబ్బంది

తప్పులు బైటపెట్టినందుకే కక్ష తీర్చు కుంటున్నారని దీక్షితులు ఆవేదన  

సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధానార్చకులు రమణ దీక్షితులుకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. టీటీడీ అధికారులు, ధర్మకర్తల మండలిపై చేసిన ఆరోపణలకు ఆధారపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అంతేగాక 65 ఏళ్లు దాటిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపజేస్తున్నట్లు తెలుపుతూ.. ఇందులో భాగంగా గొల్లపల్లి కుటుంబం నుంచి వేణుగోపాల దీక్షితులను ప్రధాన అర్చకునిగా నియమించినట్లు టీటీడీ ఈవో ఈ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులందించేందుకు టీటీడీ సిబ్బంది శుక్రవారం రమణ దీక్షితులు ఇంటికి వెళ్లగా ఆయన లేరు. దీంతో ఇంటిబయట గోడకు నోటీసు పత్రాలు అంటించి వెళ్లారు. టీటీడీలో అర్చక వారసత్వాన్ని రద్దు చేయడాన్ని తప్పుపడుతూ రమణ దీక్షితులు గత మంగళవారం చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి.

తప్పులు బైటపెట్టినందుకే నాపై కక్ష తీర్చుకుంటున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటుచేసుకుంటున్న లోటుపాట్లను బయటపెట్టినందుకు తనపై కక్ష తీర్చుకుంటున్నారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 2017 డిసెంబర్‌లో ఎలాంటి సమాచారం లేకుండా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి వంటశాలను మూసేశారని, 25 రోజులపాటు స్వామివారికి శుచిగాలేని నైవేద్యాన్ని పెట్టారని తెలిపారు. అనంతరం వంటశాల వద్ద భూకంపం వచ్చిన మాదిరి అక్కడి గోడలు, ఇటుకలు అన్నీ పడిపోయి ఉన్నాయన్నారు. పదో శతాబ్దంలో పల్లవులు, చోళులు స్వామివారికి సమర్పించిన ఆభరణాల కోసం భూమికింద వెతికినట్టు అక్కడి పరిస్థితులు స్పష్టం చేశాయన్నారు. ఈ విషయమై ఈవోను సంప్రదించగా తనకేమీ తెలియదని ఆయన చెప్పారన్నారు.

2001లో గరుడ సేవ సందర్భంగా స్వామివారికి సమర్పించిన ప్లాటినం హారంలో నడిమిన ఉండే గులాబీ రంగు వజ్రం భక్తులు విసిరిన నాణేల వల్ల పగిలిపోయిందని రికార్డు చేశారని, అయితే ఇటీవల జెనీవాలో అలాంటి వజ్రమే రూ.500 కోట్లకు అమ్ముడైందని ఆయన వెల్లడించారు. భక్తుల నాణేల తాకిడికి వజ్రం పగిలిపోయిందనడం అబద్ధమని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. వజ్రం కనిపించకుండా పోవడం, ఇతరత్రా లోటుపాట్ల గురించి బయటపెట్టినందుకే తనపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు. స్వామివారి సంపద కనిపించకుండా పోవడం, వంటశాల మూసివేత వల్ల, స్వామివారికి శుచిగా లేని నైవేద్యాన్ని పెట్టడం లాంటి పరిణామాల వల్ల భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయోనన్న భయం కలుగుతోందని ఆయన అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top